విజయవాడలో నర్సింగ్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.

విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కళాశాల ఛైర్మన్‌ అసభ్యకరంగా వ్యవహరిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సోమవారం విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

కళాశాల ప్రిన్సిపల్‌, ఛైర్మన్‌ రవీంద్రరెడ్డి వికృత చేష్టలు…
ఆందోళనకు దిగిన విద్యార్థినులు (photo)..

విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కళాశాల ఛైర్మన్‌ అసభ్యకరంగా వ్యవహరిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సోమవారం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విజయవాడ కొత్తపేట(టూటౌన్‌) పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు.

వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలుకు చెందిన బసిరెడ్డి రవీంద్రరెడ్డి ఆరేళ్ల క్రితం అంబాపురంలో బీఎస్సీ నర్సింగ్‌ జనరల్‌ కోర్సుతో ‘ఫణి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌’ ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం వైఎస్‌ఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ గుర్తింపుతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కళాశాల ప్రారంభించారు. భద్రాచలం, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 83 మంది విద్యార్థినులు ఇక్కడ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే తమతో రవీంద్రరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీఎస్సీ మొదటి ఏడాది విద్యార్థినులు సోమవారం ఆందోళనకు దిగారు.

‘మీ ప్రవర్తన నచ్చడం లేదు.. టీసీలు ఇచ్చేయండి’ అని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.

పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవిచంద్ర, రాజేశ్‌లు బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రవీంద్రరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కొందరు విద్యార్థినులు ధ్రువీకరణపత్రాలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఘటనపై సీఐ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. ఓ విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, బసిరెడ్డి రవీంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

*రాత్రి 11 గంటలకు తరగతులు*

రాత్రి 11 గంటలకు తరగతులు ఉన్నాయని చెప్పి రమ్మంటాడని, ఇప్పుడేంటని ప్రశ్నిస్తే… తనకు మూడ్‌ ఎప్పుడు వస్తే అప్పుడే తరగతులు చెబుతానంటూ రవీంద్రరెడ్డి ఇబ్బందులు పెడుతున్నారని పలువురు విద్యార్థినులు వాపోయారు.
శరీర భాగాలపై చేతులతో తాకడం, అసభ్యకరంగా మాట్లాడటం వంటివి చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగోక పోయినా, తమ ఇంట్లో వారికి ఆరోగ్యం బాగోక పోయినా.. ఫోన్‌లో కూడా మాట్లాడించేవాడు కాదని, వేధించేవాడన్నారు. ఇంటర్నల్‌ మార్కులు ఉండటం, ప్రిన్సిపల్‌-ఛైర్మన్‌గా ఆయనే ఉండటంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదన్నారు. రెండేళ్ల క్రితం సీనియర్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసి, అదే పరిస్థితి తమకూ ఎదురవుతుందనే భయంతో కళాశాల నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ మధ్యనే మరో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆందోళన చేసినట్లు చెప్పారు..