వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు..పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, జిల్లా విద్యాశాఖాధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు……

వచ్చే నెలలో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర విద్యా సంచాలకుల కార్యాలయంలో అన్ని జిల్లా విద్యాశాఖాధికారులతో ఆమె సమీక్ష జరిపారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో టెన్త్‌ పరీక్షలను ఈసారి ఆరు పేపర్లతోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్ష సమయాన్ని అరగంట పెంచామని, మొత్తం సిలబస్‌లో 70 శాతం నుంచే ప్రశ్నలుంటాయని, అధికంగా ఛాయిస్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఏర్పాట్లు చేయాలన్నారు.