కులగణనలో తెలంగాణ రాంగ్‌ రోల్‌ మోడల్‌..కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.

కులగణనలో తెలంగాణ రాంగ్‌ రోల్‌ మోడల్‌ అని, తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రేవంత్‌ సర్కారుది బీసీ వ్యతిరేక సర్వే. కాంగ్రెస్‌ కులగణన అసంపూర్తిగా, అశాస్త్రీయంగా జరిగింది. తెలంగాణలో కనీసం 50ు ఇళ్లలోనూ సర్వే చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓ సారి సర్వే చేసి, లోపాలుంటే మరో రెండ్రోజులు సమయం తీసుకుని, ఇష్టారీతిన కులగణన చేశారని ఆరోపించారు. 2010లోనే కులగణనకు అనుకూలమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లుగా మోదీ కులగణన చేయలేదనేవారు ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలని, జనాభా లెక్కలతోపాటే ఈ సర్వే సాధ్యమవుతుందని, అందుకే ఇంతకాలం ఆగారని వివరించారు. ‘‘2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్‌ తాము కులగణనకు అనుకూలమని పేర్కొంటూ అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు.అప్పటి హోంమంత్రి చిదంబరం కులగణనను వ్యతిరేకించారు’’ అని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎప్పటి నుంచో.. జనాభా లెక్కల సమయంలో కులగణన చేస్తామని చెప్పారన్నారు. అప్పట్లో సుష్మా స్వరాజ్‌ ఇచ్చిన లేఖ ఆధారంగా.. ఇప్పుడు కులగణన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ సర్కారు నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్‌ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘రాహుల్‌, రేవంత్‌కు భయపడి మేం కులగణన చేయడం లేదు. కర్ణాటక, తెలంగాణల్లో జరిపిన కులగణనలో చిత్తశుద్ధి లేదు.శాస్త్రీయ పద్ధతిలో సర్వే జరగలేదు. అసలు అవి కులగణనలే కావు. తెలంగాణలో 50ు జనాభాను కూడా చేరుకోకుండా.. మొత్తం సర్వే చేశామనడం హాస్యాస్పదం. బీసీల్లో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పక్షపాతంగా, శాస్త్రీయపద్ధతుల్లో సర్వే నిర్వహించాలి. మోదీ సర్కారు ఆలోచన ఇదే’’ అని స్పష్టం చేశారు. మోదీని ప్రశ్నించే ముందు.. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ ఎందుకు కులగణన చేయలేదో రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీల కంటే ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్‌ ముందుంటుందని విమర్శించారు. ‘‘ఎద్దుల బండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా అలానే ఉంది