22 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి….!

దీపావళి (Deepavali).. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. ఈ వెలుగుల పండుగను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంట్లో దీపాలు వెలిగించి ప్రత్యేక వంటకాలతో కుటుంబమంతా కలిసి సరదాగా వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక ఈ పండుగకు కేవళం దీపాల వెలుగులే కాదు.. టపాసుల మోత (firecrackers) కూడా ఉంటుంది. సాయంత్ర వేళ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తుంటారు. టపాసుల మోతతో నగరాలు, పట్టణాలు దద్దరిళ్లాల్సిందే. అయితే, తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ఏడు గ్రామాలు (7 Villages) మాత్రం ‘నిశ్శబ్ద దీపావళి’ (Silent Diwali)ని జరుపుకుంటున్నాయి….ఈరోడ్‌ జిల్లా (Erode district)లోని సెల్లప్పంపాళయం, వడముగం వెల్లోడే‌, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వాలాసు, పుంగంపాడి తదితర ఏడు గ్రామాలు వెల్లోడ్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి (Vellode bird sanctuary) సమీపంలో ఉంటాయి. అక్కడ అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య దేశ విదేశాల నుంచి పక్షులు వలస వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతాయి. సాధారణంగా దీపావళి పండుగ కూడా అక్టోబర్‌-నవంబర్‌ నెలల మధ్య వస్తుంది కాబట్టి.. ఆ పక్షులకు అనువైన వాతావరణం కల్పించేందుకు, వాటిని భయపెట్టకుండా ఉండేందుకు ఆ గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్షలు కేంద్రానికి చుట్టుపక్కల నివసించే సుమారు 900కుపైగా కుటుంబాలు బాణసంచా పేల్చకుండానే దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

దాదాపు 22 ఏళ్లుగా వారు ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తుండటం విశేషం. దీపావళి సందర్భంగా తమ పిల్లలకి కొత్త బట్టలు కొనివ్వడంతోపాటు, శబ్దం రాని కాకరపూవొత్తులు వంటి వాటిని కాల్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడు కూడా ఆ గ్రామాల ప్రజలు దీపావళిని ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు..