22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు..!

Bhu Bharati: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం, కాళేశ్వరం అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావించింది. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వడంతో..

అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో అంశంపై చర్యలు తీసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రైతుల భూ సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం… రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసే పనిలో పడింది. ధరణి సమయంలో లక్షలాది ఎకరాలు 22Aలో చేరాయని రైతులు ఆరోపించారు. ఒక సర్వే నంబర్‌లో కొంత భూమి ప్రభుత్వ భూమిగా ఉంటే… ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారని ప్రభుత్వం చెబుతోంది.

2023 నుంచి 2024 మధ్య...

తెలంగాణలో 2 కోట్ల 49 లక్షల 97 వేల 312 ఎకరాల భూములు ఉన్నాయి. 3 లక్షల 73 వేల 524 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2023 నుంచి 2024 మధ్య 23 వేల 136 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు మినహా మిగిలిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిన భూములను తిరిగి అసలైన హక్కుదారులకు అప్పగించే అంశంపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమ భూ బదలాయింపులకి కారణం అయిన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ ప్రకటించారు.