ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉంది.. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి…మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ..

ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించనున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశాన్ని చర్చించే విషయమై బీఏసీలో నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజధాని మార్చడం, మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న దానిపై చర్చిస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ హక్కులపై చర్చించాలని శాసన సభ్యులు కోరుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ధర్మాన లేఖఫైన బీఏసీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం.. సభకు చట్టాలు చేసే హక్కు లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టం చేయడం శాసనసభకు సంక్రమించిన హక్కు అని ధర్మాన చెప్పారు. అసెంబ్లీ, న్యాయ, కార్యనిర్వహక బాధ్యతలపై చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన వెల్లడించారు.ఇకపోతే.. అమ‌రావ‌తిలోనే ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ. శ‌నివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. త‌మ ప్ర‌భుత్వ వైఖ‌రిని మరోమారు తేల్చిచెప్పారు. ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉందన్నారు. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్వేయ‌మ‌ని బొత్స పేర్కొన్నారు.