రెవెన్యూ వ్యవస్థ, భూరికార్డుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రామ రెవెన్యూ అధికారుల శకం ముగిసింది. సుమారు రెండేళ్ల క్రితం ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం వీఆర్వోలను అధికంగా ఉన్న సిబ్బందిగా గుర్తిస్తూ, ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేసేలా తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు (జీవోనం.121) జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వీఆర్వోలను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట,్ తత్సమాన కేటగిరీల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఇది పారదర్శకంగా జరగాలని, లాటరీ విధానం అవలంబించాలని సూచించారు. ఈ సిబ్బందిని సంబంధిత విభాగాలు సర్వీసులోకి తీసుకోవాలని, రిపోర్టు చేసినప్పటినుంచి వారికి వేతనాలు, ఇతర భత్యాలు చెల్లించాలని కోరారు. సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నుంచి చివరి వేతన సర్టిఫికెట్, సర్వీసు రిజిస్టరు తీసుకోవాలని తెలిపారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జీవోను 15 రోజుల్లో రద్దుచేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి హెచ్చరించారు.
*వ్యవస్థలో ఎన్నెన్నో మార్పులు..గతంలో మాలిపటేల్, పోలీసు పటేల్ పేరిట గ్రామస్థాయిలో ఓ వ్యవస్థ అందుబాటులో ఉండేది. ఉమ్మడి ఏపీలో 1978లో ఈ పేర్లను పటేల్, పట్వారీలుగా ప్రభుత్వం మార్చింది. అప్పట్లో వీరిపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో 1985లో ఎన్టీఆర్ సర్కారు ఈ వ్యవస్థను రద్దు చేసింది. కొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి మండలానికి నలుగురు గ్రామ సహాయకుల్ని నియమించింది. 1990లో గ్రామ పరిపాలనాధికారుల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 2001లో ఆ వ్యవస్థను రద్దుచేసి రెవెన్యూ, పంచాయతీ విధులను విలీనం చేసిన ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి వ్యవస్థను తీసుకువచ్చింది. ఆ తరువాత 2006లో దీనిని రద్దు చేసి రెవెన్యూ, పంచాయతీ విధులను వేరుచేసింది. పంచాయతీలకు కార్యదర్శులను, రెవెన్యూ విధుల కోసం వీఆర్వోలను నియమించింది. గ్రామానికి ఒకరు చొప్పున, పట్టణాల్లో వార్డుకు ఒకరుచొప్పున వీఆర్వోలు నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7039 వీఆర్వో పోస్టులు ఉంటే, 5088 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయనుంది.
*ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు...
ప్రభుత్వ నిర్ణయంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీవోనం.121 కాపీలను ఆ ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం దహనం చేశారు. ‘రెండేళ్ల క్రితం వీఆర్వో వ్యవస్థ రద్దుతో రెవెన్యూశాఖలో తీవ్ర పని ఒత్తిడి పెరిగింది. స్పష్టమైన జాబ్‌కార్డు లేకుండా పోయింది. వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలని, మండలానికి జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో అయిదు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు మంజూరు చేయాలన్న మా విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు’ అని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆరోపించారు. రెండేళ్ల తరువాత వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తున్నట్లు జీవో 121 ఇచ్చారని, సర్దుబాటులో రెవెన్యూశాఖలోని ఖాళీలను చూపించకపోవడంతో ఆ విభాగం 6874 పోస్టులను కోల్పోతోందని తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో అయిదుగురు అదనపు సిబ్బందిని నియమించాలని, సర్దుబాటులో వీఆర్వోలను రెవెన్యూశాఖకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లాటరీ విధానంలోకాకుండా వీఆర్వోలకు సీనియారిటీ ప్రాతిపదికన ఆప్షన్లు ఇవ్వాలని కోరారు.
*ధరణిలో ఆన్ని జరుగుతున్న అక్రమాలు బయటపెడతాం..టీజీటీఏ…
ఖైరతాబాద్, తెలంగాణకు ఆయువు పట్టుగా ఉన్న రెవెన్యూ విభాగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ తహసీల్దార్ల సంఘం ఆరోపించింది. వీఆర్వోలను తొలగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, వీఆర్ఎలకు వేతన స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. జీవో రద్దు చేయకుంటే ధరణిలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతామని హెచ్చరించింది. ఈ మేరకు టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి… వీఆర్వోల జేఏసీ ఛైర్మన్ గోల్కొండ సతీష్, ఇతర నాయకులు నరేష్, వెంకన్న, వినయ్‌కుమార్ తదితరులతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మండలాలు, జిల్లాలు పెంచినప్పటికీ కొత్తగా ఒక్కపోస్టూ పెంచలేదు. ఇప్పుడు దాదాపు 7 వేల వీఆర్వో పోస్టులను రద్దుచేశారు. జీవో రద్దుచేయకుంటే 35 వేల పోలింగ్ కేంద్రాల పరిధిలో సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి, గవర్నరుకు ఫిర్యాదు చేస్తాం. ఇక అన్ని ఉద్యోగ సంఘాలు వీఆర్వో, వీఆర్ఏల హక్కుల కోసం పోరాడుతాయి అని వెల్లడించారు..