ఎండలు హడలెత్తిస్తున్న నేపథ్యంలో.. సోమ, మంగళవారాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ..
హైదరాబాద్: ఎండలు హడలెత్తిస్తున్న నేపథ్యంలో.. సోమ, మంగళవారాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రజలను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఈ రెండు రోజులూ తీవ్రమైన వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రధానంగా సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందంటూ ‘ఆరెంజ్’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో చల్లని ప్రదేశాల్లోనే ఉండాలి. ఎండలోకి వెళ్లకపోవడం మేలు. ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా తలకు వస్త్రం చుట్టుకోవాలి. దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలి. ‘డీహైడ్రేషన్’కు గురికాకుండా చూసుకోవాలి.
ప్రధానంగా అనారోగ్యంతో బాధపడేవారు ఇంట్లో ఉన్నప్పటికీ తగిన విశ్రాంతి తీసుకోవాలి. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. ఇంట్లో తయారుచేసుకునే ద్రవ పదార్థాలు, మజ్జిగ, నిమ్మరసం, లస్సీ వంటివాటిని సేవించాలి.
మంగళవారం కూడా జాగ్రత్తలు పాటించాలి. వదులు దుస్తులు ధరించాలి. ఎండలోకి వెళ్తే రక్షణగా గొడుగు తీసుకెళ్లాలి.
తీవ్ర వడగాలుల ముప్పు..
ఉష్ణోగ్రతల అంచనా (సోమవారం): 41-44 డిగ్రీల సెల్సియస్
*ప్రభావిత జిల్లాలు*
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ.
*ఉష్ణోగ్రతల అంచనా*
(మంగళవారం): 40-43 డిగ్రీల సెల్సియస్
*ప్రభావిత జిల్లాలు*
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.