వేగంగా కరుగుతున్న హిమాలయ పర్వతలు… విపత్తు తప్పదంటూ హెచ్చరిస్తున్న ,శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడి…
హిమాలయాల్లో పొంచి ఉన్న పెను ప్రమాదాలు..
గ్లోబల్ వార్మింగ్ వల్ల కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. ఇలాంటి ప్రమాదాల గురించి మనకు ఎంత తెలుసనడానికి, ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇటీవల వచ్చిన జలప్రళయమే ఒక తాజా ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు…
వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమనీనదాలు మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) మంగళవారం విడుదల చేసిన నివేదికలో హిమాలయాల్లో ఏర్పడబోయే జల ప్రళయాల గురించి(unpredictable disasters) శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే 65 శాతం వేగంగా అదృశ్యమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు.(Himalayan Glaciers Melting) హిమాలయాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పలు విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించారు…
ఉష్ణోగ్రత వేడెక్కుతున్నకొద్దీ మంచు కరుగుతుందనేది ఊహించిందేనని, ఇది ఆందోళన కలిగిస్తుందని శాస్త్రవేత్త ఫిలిప్పస్ వెస్టర్ చెప్పారు. మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా హిమాలయాల్లో మంచు కరిగి జలప్రళయాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు పర్వత ప్రాంతాల్లో నివశిస్తున్న 240 మిలియన్ల ప్రజలకు నదీ లోయల్లోని 1.65 బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన మంచినీటి వనరుగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్థుత వాతావరణ మార్పుల వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి హిమానీనదాల ప్రస్తుత పరిమాణంలో 80 శాతం వరకు కోల్పోవచ్చని నేపాల్ శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరుగుతోందట అదే జరిగితే సముద్రతీరానికి 60 మైళ్ల పరిధిలోని భూభాగాలు నామరూపాలు లేకుండా మునిగిపోతాయట. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో ధ్వాయిట్స్ మంచుకొండ వాటానే అధికంగా ఉందట. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది సముద్రతీరంలోనే నివశిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే వారందరి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది…
హిమానీనదం ముక్కలైతే కొండచరియలు విరిగిపడొచ్చు…
హిమానీనదం ముక్కలైనప్పుడు ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కొండచరియలు, బండరాళ్లు పడడం లాంటివి జరగవచ్చు. దానివల్ల పర్వతం వాలు మొత్తం కూలిపోయే అవకాశం కూడా ఉంది.2016వ సంవత్సరంలో టిబెట్‌లోని అరూ పర్వతంపై ఒక గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. దానివల్ల భారీగా మంచుచరియలు పడ్డాయి. 2012వ సంవత్సరంలో పాక్ పాలిత కశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్ దగ్గర జరిగిన ఒక ప్రమాదంలో 140 మంది మరణించారు.
శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తల అధ్యయనం
1999 నుంచి 2018 వ సంవత్సరం వరకు కొండచరియలు విరిగిపడటానికి కారణం హిమానీనదాలు కరగడమేనని అమెరికా జియాలాజికల్ సర్వే శాటిలైట్ చిత్రాల ఆధారంగా చైనా సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు చెప్పారు.2009 నుంచి 2018 మధ్య మొత్తం 127 కొండచరియలు విరిగి పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.హిమాలయాల్లోని హిందూకుష్ ప్రాంతంలో 50 వేలకు పైగా హిమానీనదాలు ఉన్నాయి. ఈ హిమనీ నదాలు కరిగితే పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.