తుమ్మల నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది భేటి…. కాంగ్రెస్ పార్టీ లొకి ఆహ్వానం..!

BRS పార్టీ పై అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని తుమ్మల నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు వెళ్లి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం ఉండటంతోనే వారిని తన నివాసానికి తుమ్మల ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి, మల్లు రవి కూడా ఉన్నారు. వారందరినీ తమ్ముల నాగేశ్వరరావు శాలువాలతో సన్మానించారు.

అంతకుముందు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తుమ్మల ..ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. ర్యాలీలో కేవలం ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. అనంతరం ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని తెలిపారు. మీతో శభాష్‌ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ తలవంచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తల నరుక్కుంటా కానీ.. తలవంచనని స్పష్టం చేశారు..