అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం ..కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి అర్జున్ ముండా..

రైతుల నిర‌స‌న‌లు బుధ‌వారం రెండో రోజుకు చేర‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఆందోళ‌న చేప‌ట్టిన అన్న‌దాల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ స‌హాయ‌మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. చ‌ర్చ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని, సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి అవాంతరాలు క‌ల్పించ‌రాద‌ని మంత్రి రైతుల‌కు విజ్ఞప్తి చేశారు.సాధార‌ణ జ‌న‌జీవనం భ‌గ్నం కాకుండా చూడాల‌ని తాను రైతు సంఘాల‌ను కోరుతున్నాన‌ని, రైతు సంఘాల‌తో సానుకూల వాతావ‌ర‌ణంలో చర్చ‌లు కొన‌సాగుతాయ‌ని తానిప్ప‌టికే స్ప‌ష్టం చేశాన‌ని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఛ‌లో ఢిల్లీని పుర‌స్క‌రించుకుని సింఘు, టిక్రి స‌రిహ‌ద్దుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయ‌డంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీకి భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మ డిమాండ్ల సాధ‌న‌కు మ‌రో ఉద్య‌మానికి శ్రీకారం చుడుతూ రైతులు ఢిల్లీ త‌ర‌లిరావాల‌ని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మ‌జ్దూర్ మోర్చా స‌హా ప‌లు రైతు సంఘాలు పిలుపుఇచ్చాయి. ఢిల్లీలోకి రైతుల‌ను అడుగుపెట్ట‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టింది. బారికేడ్లు, భాష్ప‌వాయు గోళాల‌తో రైతుల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నంతో దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.