క్రికెట్‌లో మరో వింత.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు.

ఒకే ఓవర్లోని ఆరు బంతులు సిక్సులుగా వెళ్లడం మనం ఇదివరకు చూశాం. అయితే అంతకుమించిన ఓ అద్భుతం జరిగింది.

ఆటలో అప్పుడప్పుడు కొన్ని అరుదైన, అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు వికెట్లు పడడం.. ఒకే ఓవర్లోని ఆరు బంతులు సిక్సులుగా వెళ్లడం మనం ఇదివరకు చూశాం. అయితే అంతకుమించిన ఓ అద్భుతం జరిగింది. తాజాగా ఒకే ఓవర్లు ఆరు వికెట్లు పడ్డాయి. ఈ అత్యద్భుతం నేపాల్ ప్రో క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో చోటు చేసుకుంది. ఒక ఓవర్లో హ్యాట్రిక్ పడడమే గొప్ప అని భావిస్తున్న ఈ రోజుల్లో ఏకంగా ఆరు వికెట్లు పడడంతో అందరూ షాక్ అవుతున్నారు. నేపాల్ ప్రో క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ, మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మలేషియా ఎలెవెన్‌ స్పిన్నర్ విరన్‌దీప్ సింగ్‌ ఆఖరి ఓవర్ వేశాడు. తొలి బంతిని వైడ్‌గా వేసిన విరన్‌దీప్‌.. ఆ తర్వాత వేసిన లీగల్ బంతికి ఓ బ్యాటర్ రనౌట్‌ అయ్యాడు. ఆపై వేసిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్‌ హ్యట్రిక్‌ నమోదు చేశాడు. హ్యాట్రిక్‌ సాధించిన తర్వాత అతడు సెలబ్రేషన్‌ చేసుకున్నాడు.

విరన్‌దీప్ సింగ్‌ వేసిన చివరి ఓవర్లో పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచులో వీరన్‌దీప్‌ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి.. 5 వికెట్లు పడగొట్టాడు. చివరి నాలుగు బంతులకు నాలుగు వికెట్స్ పడగొట్టిన విరన్‌దీప్.. హ్యట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు. విరన్‌దీప్ తీసిన ఐదు వికెట్లలలో బోల్డ్, క్యాచ్ ఔట్లు ఉన్నాయి. స్పిన్నర్ విరన్‌దీప్ దెబ్బకు 131-3గా ఉన్న స్పోర్ట్స్‌ ఢిల్లీ స్కోర్ చివరకు 132-9గా మారింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 132/9 స్కోరు చేయగా.. ఛేదనలో మలేషియా 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.