అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలతోపాటు పలు దేశాలకు భారీ ఊరటనిచ్చారు. రష్యా ఎగుమతులకు సంబంధించి తాను గత నెలలో సంతకం చేసిన వివాదాస్పద బిల్లు అమలును ఒకరోజు ముందే నిలిపివేశారు. రష్యాపై విధించిన ఆంక్షలు, ఆ దేశ వస్తువులపై విధించిన దిగుమతి సుంకాల అమలును తాత్కాలికంగా సడలిస్తున్నట్లు ప్రకటించారు.
జాతీయ ప్రయోజనాల కోసమే..
అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో దీనిపై స్పందించారు. ‘గ్రాహం చట్టం కింద ఉన్న ఆంక్షలు, నిబంధనలు, సుంకాల విధింపును నేను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాను. ఈ సమయంలో ఈ మినహాయింపు ఇవ్వడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని కాంగ్రెస్కు నివేదించాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి ఆంక్షల అమలును మాత్రమే నిలిపివేశారని.. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ట్రంప్ వీటిని మళ్లీ అమలు చేసే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది…
ఇటీవల రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. నవంబరులో మరో 5 లక్షల టన్నులు పంపనున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంపై విమర్శలు వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేలా చట్టం తీసుకొచ్చిన అమెరికా.. అదే సమయంలో రష్యాతో ఒప్పందం చేసుకోవడం ఏమిటని కొందరు ప్రశ్నించారు.
అమెరికాలో డీజిల్ ధరలను తగ్గించేందుకే ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఇంధన ధరలు కీలక రాజకీయ అంశంగా మారాయి. ధరలు పెరిగితే ప్రజల్లో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉండటంతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు…
ట్రంప్ ఇచ్చిన తాజా మినహాయింపు అంటే భారత్పై ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని అమెరికా సుంకాలు రద్దయినట్లు కాదు. అలాగే, ఇతర చట్టాల కింద రష్యాకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షల నుంచి కూడా భారత్కు పూర్తి మినహాయింపు లభించినట్లు కాదు. తాజా ఉత్తర్వులు ప్రధానంగా కొత్త చట్టం కింద ప్రతిపాదించిన అదనపు సుంకాలు, ఆంక్షల అమలుకు సంబంధించినవి. అమెరికా ప్రభుత్వం పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైతే భవిష్యత్తులో మళ్లీ చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా ఉంచుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అవకాశం ఉన్న చట్టం నుంచి ట్రంప్ ప్రస్తుతానికి మినహాయింపులు ఇవ్వడం భారత్కు ఊరటనిచ్చే పరిణామం.
రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా కొత్త చట్టం కల్పించింది. లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 పేరుతో రూపొందించిన ఈ చట్టాన్ని అమెరికా ప్రభుత్వం సెప్టెంబరులో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే ప్రధాన దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యాకు సహకరిస్తున్న దేశాలపైనా చర్యలు తీసుకోవచ్చు. ఈ నిబంధనలతో భారత్పైనా భారీ సుంకాలు విధించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ కు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఏర్పడింది.
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టంలోని కొన్ని ఆంక్షలు, సుంకాల అమలును నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రం, నివేదికను అమెరికా కాంగ్రెస్కు సమర్పించారు. ఈ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తే, కాంగ్రెస్కు నివేదిక సమర్పించి సంబంధిత ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. ట్రంప్ ఇదే నిబంధనను ఉపయోగించుకున్నారు. దీంతో ఈ చట్టం కింద విధించే అదనపు సుంకాల నుంచి ప్రస్తుతానికి మినహాయింపు లభించింది..
ప్రకటన..
హెల్త్ పాలసీ పూర్తి డీటెయిల్స్ కే సంప్రదించండి..

