రెండో ర్యాంక్‌లో బుమ్రా…!

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 856 పాయింట్లతో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌(881)కు బుమ్రా కేవలం 25 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడం బుమ్రా ర్యాంకింగ్ మెరుగుపడటానికి కారణమైంది…మరోవైపు భారత బ్యాటర్లు కూడా టాప్‌-10లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 128 పరుగులతో ఆకట్టుకున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(744 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. 98 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌(728 పాయింట్లు) ఏడో స్థానంలో ఉండగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌(713 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. దీంతో టాప్‌-10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు నిలబెట్టుకున్నారు. ఇక టీమిండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తొలి టెస్టులో 80 పరుగులతో రాణించిన యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇదిలా ఉంటే, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్(861 పాయింట్లు) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. జో రూట్(816 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా(807 పాయింట్లు) మూడో స్థానానికి ఎగబాకాడు. భారత్‌పై తొలి టెస్టులో అదరగొట్టిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ పది స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంక్‌లో నిలవగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 13 స్థానాలు ఎగబాకి కెరీర్‌ అత్యుత్తమమైన 17వ ర్యాంక్‌ను అందుకున్నాడు.