పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్‌..!

ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెట్టబోతోందని ప్రచారం జరుగుతోంది..దీంతో భారత నిఘా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. కశ్మీర్‌ సంఘీభావ దినం సందర్భంగా బుధవారం పీవోకేలో ‘అల్‌ అక్సా ఫ్లడ్స్‌’ పేరిట ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో హమాస్‌కు చెందిన సీనియర్‌ నేత ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సభను రావల్కోట్‌లోని సబీర్‌ స్టేడియంలో ఏర్పాటుచేశారు. దీనిలో ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, సీనియర్‌ నాయకులు కూడా పాల్గోనున్నారు.

ఈ కార్యక్రమంలో హమాస్‌ ప్రతినిధి ఖలీద్‌ కద్దౌమి ప్రసంగించనున్నట్లు కరపత్రాలు, ఇతర మార్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అతడు కశ్మీర్‌లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. జిహాదీ సంస్థలు తమ వాదనలకు బలం చేకూర్చేలా వాదనలు సృష్టించేందుకు దీనిని వాడుకోవచ్చు. మసూద్‌ అజర్‌ సోదరుడు తల్హాసైఫ్‌, అస్గర్‌ఖాన్‌, ఇలియాస్‌ మసూద్‌ వంటి ఉగ్రవాదులు సభకు హాజరుకావచ్చని చెబుతున్నారు.

ఈ సమయంలో భారత హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం జమ్మూకశ్మీర్‌పై హైలెవల్‌ మీటింగ్‌ను నిర్వహించారు. అక్కడి భద్రతా పరిస్థితులను, కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడం వంటి అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. కశ్మీర్‌లో వాహన తనిఖీలను కూడా తీవ్రతరం చేయాలని ఆదేశించారు. గతేడాది ఆగస్టులో హమాస్‌ నేతలతో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ భేటీ అయ్యాడు. ఖతార్‌ రాజధాని దోహా దీనికి వేదికైంది. 2018లో సైఫుల్లాను అమెరికా ఉగ్రజాబితాలో చేర్చింది. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు అతడు సన్నిహితుడు..