ఉగ్రవాదం పై పోరుకు భారత్ వెంటే… మద్దతు తెలిపిన ఆ దేశం….!

పహల్గామ్ ప్రతీకారం..

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

పాక్ భూభాగంపై విధ్వంసం

తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలోచీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.

ఉగ్రవాద సంస్థలు ఛిన్నాభిన్నం..

తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది. బహవాల్‌పూర్‌ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి.

లష్కర్, హిజ్బుల్..

ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. దీనితో పాటు సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు ఛిన్నాభిన్నం అయ్యాయని పేర్కొన్నాయి.

మద్దతు ప్రకటించిన దేశం..

ఈ యుద్ధంలో భారత్‌కు మద్దతు ప్రకటించింది.. ఇజ్రాయెల్. అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడించింది. ఈ యుద్ధంలో భారత్‌ వైపు నిలిచిన తొలి దేశం ఇదే. పాకిస్తాన్‌పై మిస్సైళ్లను సంధించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ తెర మీదికి వచ్చింది. భారత్‌కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని వెల్లడించింది.

ఉగ్రవాదాన్నిక్షమించకూడదు..

ఈ విషయాన్ని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వ్యాఖ్యానించారు.

ఆత్మరక్షణ హక్కుగా..

పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన మిస్సైళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణించారు రువెన్ అజర్. ఈ సైనిక చర్యను అన్ని రకాలుగా ఇజ్రాయెల్ సమర్థిస్తుందని తేల్చి చెప్పారు. అమాయకులపై ఉగ్రవాదులు చేసే దారుణమైన నేరాలకు మూల్యం చెల్లించడం సమర్థనీయమని అన్నారు. దాక్కోవడానికి తమకు ఎక్కడే గానీ చోటు లేదనే విషయాన్ని ఉగ్రవాదులు గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సుదీర్ఘకాలంగా మిలిటెంట్ల దాడులు..

ఇజ్రాయెల్ కూడా సుదీర్ఘకాలంగా మిలిటెంట్ల దాడులను ఎదుర్కొంటూ వస్తోన్న విషయం తెలిసిందే. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హౌతీ మిలిటెంట్ల నుంచి తరచూ ఇబ్బందికర పరిస్థితులను చవి చూస్తోంది. 2023లో భారీగా నష్టపోయింది కూడా. 2023 అక్టోబర్‌లో హమాస్ జరిపిన మారణహోమంలో పలువురు ఇజ్రాయెలీలు హతం అయ్యారు. వారి చేతికి బందీలుగా చిక్కారు.

మధ్య తూర్పు దేశాల్లో..

ఈ దాడులు ప్రతిదాడులతో రెండున్నర సంవత్సరాలుగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌, యెమెన్ తరచూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

మొన్నటికి మొన్న..

మొన్నటికి మొన్న యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై భారీ దాడికి దిగారు. భీకరంగా దాడి చేశారు. మిస్సైళ్లను సంధించారు. ప్రధానంగా బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీల దాడి భయానకంగా కొనసాగింది. ఈ ఎయిర్‌పోర్ట్‌పై ఏకంగా బాల్లిస్టిక్ క్షిపణులను సంధించారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.