రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వనున్నాయి. ఈ ప్రక్రియ 9 రోజుల పాటు జరగనుంది. ఎకరాలవారీగా కాక అందరికీ రైతుభరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. కోటి 49 లక్షల 35 వేల ఎకరాలకు రైతుభరోసా నిధులు విడుదల చేశారు..

ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి రైతునేస్తం కార్యక్రమంను ప్రారంభించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి మరో 1034 రైతువేదికల్లో రైతునేస్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. రైతునేస్తం ద్వారా రైతులకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని, వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభకు వివిధ ప్రాంతాలకు చెందిన 1500మంది రైతులు హాజరయ్యారు…

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్లకు బిల్లులు పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. నేను సీఎం అయ్యేనాటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోయిందని గుర్తు చేశారు. గత సీఎం అందినకాడల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారని తెలిపారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వివరించారు.

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని ఆనాడు పెద్దమనిషి చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి దూషించారు. రైతులను వరి వేయొద్దని చెప్పిన పెద్దమనిషి తన ఫామ్హౌస్లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారని, తన ఫాంహౌస్లో పండించిన వరిని క్వింటాల్కు రూ.4 వేల చొప్పున అమ్ముకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదు, ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం పక్కదారి పట్టిందని వివరించారు. సన్నబియ్యం తినే ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రానికి సరిపడా సన్నబియ్యం కావాలంటే సన్నవడ్ల సాగును ప్రోత్సహించాలని భావించామని వివరించారు…