దాదాపు 20 ఏళ్ల తర్వాత శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఒకే రాజకీయ వేదికపైకి చేరుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబయిలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. మరాఠీ తమ హక్కు అని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. మహాయుతి సర్కారు రాష్ట్రంలో హిందీ భాషను అమలు చేయిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఈ సభను ఇరుపార్టీలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి..
మహారాష్ట్ర (Maharashtra)లోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 16న ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో జూన్ 17న హిందీని ఆపన్షల్ భాషగా పేర్కొంటూ మరో జీవో జారీ చేసింది..
వర్లిలో విజయోత్సవ వేడుకలు..
ఈ సందర్భంగా శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) విజయోత్సవ వేడుకలను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ముంబైలోని వర్లిలోని NSCI డోమ్ వేడుకలకు వేదికైంది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని “తప్పనిసరి” చేయడాన్ని ఈ రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ..
రెండు దశాబ్దాల తర్వాత విడిపోయిన ఉద్ధవ్(Uddav Thackeray), రాజ్ ఠాక్రే (Raj Thackeray) ఒకే వేదికను పంచుకుంటుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయోత్సవ సభకు సాహితీప్రియులు, భాషాభిమానులు, వివిధ కళా రంగాలకు చెందిన వ్యక్తులు హాజరుకావాలని ఇప్పటికే రెండు పార్టీలు పిలుపునిచ్చాయి.