పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ, అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. భారత్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి, చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది..తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిచిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏప్రిల్ 25న ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్,క్షిపణి దాడులు సాగాయి. అనంతరం ఈ సంఘర్షణ ముగింపునకు భారత్- పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి..
పహల్గామ్ సంఘటనపై పాకిస్తాన్ వైఖరి
పహల్గామ్ దాడిపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, అప్పుడే నిందించడం సరికాదని పాకిస్తాన్ పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ‘అంతర్జాతీయంగా వివాదాస్పదమైనది’ అని పేర్కొన్న పాకిస్తాన్, ఈ కేసులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) ప్రత్యక్ష ప్రమేయం ఉందనే భారతదేశ వాదనను తిరస్కరించింది, ఇది గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధమని పేర్కొంది. పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఒక ఇనాక్టివ్, నిషేధిత సంస్థ అని, దానిని పూర్తిగా నిర్మూలించామని పాకిస్తాన్ తెలిపింది. ఆ సంస్థ అగ్ర నాయకులను అరెస్టు చేసి, వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ విషయం అమెరికా దేశీయ చట్టాలకు సంబంధించినదని పాకిస్తాన్ పేర్కొంది, అయితే భారతదేశం ఈ అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ను కించపరచడానికి, “అంతర్జాతీయ దృష్టిని మళ్లించడానికి” ఉపయోగిస్తుందని తెలిపింది..
అమెరికా ప్రకటనను స్వాగతించిన భారత్.
భారత్-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి బలమైన సాక్ష్యమని ఆయన అభివర్ణించారు. టీఆర్ఎఫ్ పూర్తిగా లష్కరే తోయిబాకు ముసుగు సంస్థ. పెహల్గామ్లో చాలామంది అమాయకుల ప్రాణాలను ఆ సంస్థ బలి తీసుకుంది. అటువంటి సంస్థను ఎప్పటికీ సహించకూడదన్న అమెరికా అభిప్రాయాన్ని పేర్కొంటూ జైశంకర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతకుముందు పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థ సంస్థగా ప్రకటించింది. టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఉగ్రవాదాన్ని నిరోధించడంలో అమెరికా-భారత మధ్య పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తుంది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. టీఆర్ఎఫ్పై ఈ చర్య మా జాతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు పెహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును అమలు చేయడంలో అమెరికా ప్రభుత్వ పరిపాలనలో నిబద్దతను సూచిస్తుందన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందువులే టార్గెట్గా చేసిన ఈ దాడిపై అంతర్జాతీయంగా అనేక దేశాలు ఖండించాయి. ఈ ఘటన తర్వాత భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదుల క్యాంపులను ధ్వంసం చేసింది.