విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ద్వంద్వ వైఖరి ఆశ్చర్యపరుస్తోంది. ఓ వైపు టారిఫ్లపై బీజింగ్కు వార్నింగ్ ఇస్తూ వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వుతూనే…చైనా (China) విద్యార్థులకు అమెరికా తలుపులు తెరుస్తున్నారు. ఏకంగా 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను (Chinese Students) అగ్రరాజ్యానికి ఆహ్వానిస్తున్నారు. ట్రంప్ తీరు సొంత పార్టీ నేతలను అసహనానికి గురిచేస్తోంది.
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారు, పరిశోధన రంగంలో ఉన్నవారికి వీసాలు (US visa) రద్దు చేస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కూడా కఠినతరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చైనా విషయంలో ట్రంప్ (Donald Trump) యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
తాజాగా వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”చైనీస్ విద్యార్థులను అమెరికాలోకి మేం అనుమతించబోమంటూ వచ్చిన వార్తలను విన్నాం. కానీ, మేం వారికి మన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించాలనుకుంటున్నాం. మనకు అది చాలా ముఖ్యం కూడా. 6 లక్షల మంది చైనా విద్యార్థులు అమెరికాకు వచ్చేందుకు అనుమతిస్తాం. ఆ దేశంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం” అని ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా వర్సిటీల్లో దాదాపు 2.70లక్షల మంది చైనీస్ విద్యార్థులు చదువుకుంటున్నారు.
ట్రంప్ వీసా దెబ్బ.. వేల మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లకు అవస్థలు..!
ట్రంప్ తాజా ప్రకటన రాజకీయ వివాదానికి దారితీసింది. ఆయన నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా విద్యార్థులకు అవకాశం కల్పించడం అంటే.. ‘అమెరికా ఫస్ట్’ (America First) అజెండాకు ద్రోహం చేసినట్లేనని మండిపడుతున్నారు. అమెరికా విద్యార్థులకు రావాల్సిన అవకాశాలను చైనీయులకు ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని అధ్యక్షుడి యంత్రాంగం సమర్థించింది. ”చైనీస్ విద్యార్థులను అనుమతించకపోతే.. అమెరికాలో 15శాతం యూనివర్సిటీలకు పని లేకుండా పోతుంది. ఆర్థిక విధానాలను పరిగణనలోకి తీసుకునే ట్రంప్ హేతుబద్ధంగా వ్యవహరించారు” అని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు..