జగిత్యాల జిల్లాలోని గోపాలపల్లి గ్రామం ఇటీవల ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటనకు వేదికైంది. పట్టణంలో ఓ కుటుంబం పక్షులపై చూపించిన ప్రేమ, మమకారం అందరినీ ఆకట్టుకుంటోంది. పుట్టినరోజు కానుకగా ఇంటికి వచ్చిన 2 చిన్న పక్షులు ఇప్పుడు ఆ కుటుంబంలో భాగమైపోయి, ప్రేమను పంచుతూ, ఆనందాన్ని పంచుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరంగా, ఆ పక్షులు తాజాగా 3 పిల్లలకు జన్మనివ్వగా, కుటుంబం వాటి బారసాలను ఘనంగా జరపడం అందరినీ కదిలించింది…
గోపాలపల్లి గ్రామానికి చెందిన కాసారపు స్వాతి కుటుంబానికి సంబంధించినది. స్వాతి గృహిణి మాత్రమే కాదు, హోమ్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని సమర్థంగా నడిపించే ఒక ఆదర్శ మహిళ. ఆమె కుమారుడు మణి చిన్నప్పటి నుంచే పక్షులంటే అమితమైన ఇష్టం చూపేవాడు. పక్షులను దగ్గరగా చూసుకోవడం, వాటితో ఆడుకోవడం అతనికి ఎంతో ఇష్టం. ఈ విషయం గమనించిన కుటుంబ స్నేహితురాలు, గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి, మణి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన కానుకను రెండు అందమైన పక్షుల రూపంలో అందించారు..
ఆ పక్షులకు మణి “రాధా”, “కృష్ణ” అని పేర్లు పెట్టాడు. ఆ రోజు నుంచి ఇవి కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల్లా మారిపోయాయి. ఉదయాన్నే మణి, అతని తల్లి స్వాతి, తండ్రి ఇతర కుటుంబ సభ్యులు ఈ పక్షులను చూసుకోవడమే తమ దినచర్యలో ఒక భాగం చేసుకున్నారు. వాటి కోసం వేరే ఆహారం సిద్ధం చేయడం, శుభ్రంగా ఉండే గూడు ఏర్పాటు చేయడం, ప్రతిరోజూ వాటితో మాట్లాడటం, ఆడుకోవడం ఇప్పుడు ఆ ఇంటి సంస్కృతిలో ఒక మధురమైన భాగంగా మారింది..
ఆమె కొడుకు మణికి చిన్నప్పటి నుంచే పక్షులంటే అమితమైన ఇష్టం. ఈ విషయం గమనించిన గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి, మణి పుట్టినరోజు సందర్భంగా రెండు పక్షులను గిఫ్ట్గా ఇచ్చారు. వాటికి “రాధాకృష్ణ” అని పేర్లు పెట్టి కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు.
రాధాకృష్ణలు తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. ఆదివారం (ఆగస్టు 31) పుట్టిన ఆ పక్షి పిల్లలకు బారసాల ఘనంగా జరిపారు. ముత్తైదువులను పిలిచి వేడుకను నిర్వహించారు. పక్షుల బారసాలు జరిపిన ఈ కుటుంబం ఇప్పుడు పక్షి ప్రేమికులకు ఆదర్శంగా మారింది. ఎక్కడ కూడా జరగని ఈ వేడుకను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు. ఈ వేడుకను తమ సెల్ ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.