కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. నాపై కుట్రలు చేసిన వాళ్లు.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. కవిత

బీఆర్ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా* స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కవిత.


బీఆర్ఎస్‌ పార్టీ నాది.. నేను 20 ఏళ్లుగా కష్టపడ్డా.. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది.. బీఆర్ఎస్‌ పార్టీకి నేనేం చేయలేదా?-కవిత..

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె, భారత రాష్ట్ర సమితిలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. “పదవులు పోతే, సస్పెండ్‌ చేస్తే పోయే బంధం కాదు మాది. వ్యక్తిగత లబ్ధిపొందాలనే ఆలోచనతో పార్టీలో కొందరు ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఉండకూడదు, మా కుటుంబం బాగుండవద్దని కోరుకుంటున్నారు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది. ఇందులో భాగంగానే నన్ను పార్టీలో నుంచి బయటకు పంపారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని నన్ను బయటకు పంపారు. భవిష్యత్తులో ఇదే ప్రమాదం కేటీఆర్‌కు కూడా పొంచి ఉంది. బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే నన్ను బయటకు పంపారు. అని కవిత పేర్కొన్నారు.

హరీశ్రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? : ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోశ్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నట్లు చెప్పడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ స్ఫూర్తిగానే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడానని తెలిపారు. సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నానని ప్రచారం చేశారన్నారు. హరీశ్రావు, సంతోశ్లు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? బంగారు తెలంగాణ కావాలని నినాదం ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. హరీశ్రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు..

కేసీఆర్, కేటీఆర్, నేను.. మాది ఒక కుటుంబం. మాది రక్త సంబంధం. పదవులు పోతేనో.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనో పోయేటువంటి బంధం మాదికాదు. కానీ, కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా వాళ్లకు అధికారం వస్తుందని వారి ఆలోచన. దానిలో భాగంగానే మొదటి స్టెప్ పడింది. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. నన్ను ఇవాళ బయటకు పంపించారు. రేపటి నాడు ఇదే ప్రమాదం కేటీఆర్‌కు పొంచిఉంది. ఆ తరువాత కేసీఆర్‌ను బయటకు పంపిస్తారు. బీఆర్ఎస్ పార్టీని వాళ్ల హస్తగతం చేసుకునేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని కవిత అన్నారు.

నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాల నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతదేశంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేశారని కవిత అన్నారు. బౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా..? బంగారు తెలంగాణ అంటే హరీశ్ రావు, సంతోస్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా..? అంటూ కవిత ప్రశ్నించారు.

నాపై అప్పటి నుంచే కుట్రలు..
ఎప్పుడైతే హరీశ్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేశారో అప్పటి నుంచే మా కుటుంబంపై కుట్రలు మొదలయ్యాయని కవిత అన్నారు. హరీశ్ రావు రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యాక మా కుటుంబాన్ని విడగొట్టాలని ప్లాన్ షురూ అయిందంటూ కవిత ఆరోపించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి, హరీశ్ రావులు చెప్పాలి.. ఒకే విమానంలో మీరిద్దరూ కలిసి వచ్చారా.. రాలేదా..? అంటూ కవిత ప్రశ్నించారు.
హరీశ్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అంటారు. కానీ, హరీశ్ రావు గురించి మాట్లాడరు. కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీశ్ రావు, సంతోష్ రావులేనని కవిత అన్నారు.

హరీశ్ రావు , కేసీఆర్ తో మొదటి నుంచి లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్ కు హరీశ్ రావు కట్టప్ప లాగా అంటారు. హరీశ్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వను.. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా..? అంటూ కవిత కంటతడి పెట్టారు.

వాళ్ల వల్ల కేటీఆర్‌కు చెడ్డపేరు వస్తుంది..
బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్స్ ను సృష్టించేది హరీశ్ రావే.. హరీశ్ రావు, సంతోష్ లను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుందని కవిత అన్నారు. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. ఎంత బాధ కలిగితే ఈ విధంగా మాట్లాడుతా. పార్టీని, కేసీఆర్ ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న.. హరీశ్ రావు నక్కజిత్తులను గమనించండి అంటూ కేటీఆర్ కు కవిత సూచించారు.

దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమికి హరీశ్ రావే కారణం. నిజామాబాద్ లో నా ఓటమికి కుట్ర చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కుట్రలే కారణమని కవిత అన్నారు.

సంతోష్ రావు వల్ల కేటీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని కవిత అన్నారు. హరీశ్ రావు, సంతోస్ గ్యాంగ్ లు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. నాపై కుట్రలు చేసిన వాళ్లు.. ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ కవిత అన్నారు.