భారత్‌, రష్యాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు…

భారత్‌, రష్యాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీకి దూరమయ్యామంటూ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. భారత్‌తోపాటు రష్యాకు కూడా దూరమైనట్లు తెలిపారు. ఆ దేశాలు చీకటి చైనా చేతిలో పడ్డట్లు కనిపిస్తోందని తెలిపారు. ఈ మేరకు పుతిన్‌, జిన్‌పింగ్‌, మోదీ ఫొటోను పోస్టు చేశారు..

సుంకాల పేరుతో ట్రంప్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా, రష్యాలపై పెత్తనం చెలాయించాలని చూశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్ ఎగుమతులపై ట్రంప్ 50శాతం టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాకు భారీ నష్టం కలిగించేలా ఉందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు…

సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా!.

షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్రంప్, వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. “భారత్‌, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ సెటైరికల్గా పోస్ట్ చేశారు. తియాన్‌జిన్‌ వేదికగా జరిగిన ఎస్‌సీవో సదస్సులో రష్యా, చైనా, భారత్‌ అధినేతలు ఒకే వేదికపై కనిపించారు..

భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఇటీవల చైనాలోని తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌-రష్యా, భారత్‌-చైనా, రష్యా-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఆయా దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశాల్లో చర్చించారు. ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ట్రంప్‌కు కంటగింపుగా మారాయి.

అందుకు ఈ మూడు దేశాలను ఎత్తిపొడుస్తూ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘భారత్‌, రష్యా దేశాలను తాము వక్రబుద్ధి కలిగిన చైనాకు కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. చైనా చీకటి వలయంలోకి ఆ దేశాలు వెళ్తున్నాయి. ఆ మూడు దేశాలు కలిసిమెలిసి కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నా’ అని ట్రంప్‌ తన పోస్టులో పేర్కొ్న్నారు.

కాగా చైనాను నియంత్రించాలంటే భారత్‌ తమకు సరైన భాగస్వామి అని అమెరికా మొదటి నుంచి భావిస్తూ వస్తోంది. అందుకే రిపబ్లికన్‌లు, డెమోక్రాట్‌లు అన్న తేడా లేకుండా ఎవరు అమెరికా అధ్యక్షులైనా భారత్‌తో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆఖరికి డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు భారత్‌తో మంచి సంబంధాలనే కొనసాగించారు. కానీ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు…