చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం మూసివేత..!

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం నేపథ్యంలో ఇప్పటికే ఆలయం మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అయితే.. తాజాగా.. ప్రతి నెల నిర్వహించే పౌర్ణమి గరుడ సేవపై కూడా అధికారులు కీలక ప్రకటన చేశారు…

యాదగిరిగుట్టలో ఈ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు భక్తులకు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. ఆ తర్వాత ఆలయ తలుపులను మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాల బ్యాచ్ను ఆలయ అధికారులు రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చనలను అర్చకులు నిర్వహించనున్నారు.

పలు ఆలయాల్లో : వరంగల్లో ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకే పూజాదికాలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. హనుమకొండ వేయిస్తంభాల గుడిలో 12 గంటలకు ద్వారబంధనం చేయనున్నారు. ములుగు జిల్లా రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయ తలుపులను మూసివేయనున్నారు. త్రివేణీ సంగమ తీరాన వెలసిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం ఆలయాల సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లుగా అధికారులు తెలిపారు.

చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం మూసివేత : ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకల్లా దర్శనాలు పూర్తిచేస్తామని, 30 వేల నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. అన్నప్రసాద కేంద్రాన్ని సైతం మూసివేయనున్నామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక మూడు గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని వివరించారు. అప్పటి నుంచే సర్వదర్శనం క్యూలైన్ లోకి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. అనంతరం నేరుగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది…