నేటి పంచాంగం..నేటి నుండి మహాలయ పక్షం ప్రారంభం..!

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 08 – 09 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం ),
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
బహుళ పక్షం,

తిథి : *పాడ్యమి* రా10.21 వరకు,
నక్షత్రం : *పూర్వాభాద్ర* రా10.09 వరకు,
యోగం : *ధృతి* ఉ9.03 వరకు,
కరణం : *బాలువ* ఉ11.07 వరకు,
తదుపరి *కౌలువ* రా10.21 వరకు,

వర్జ్యం : *ఉ.శే.వ6.38 వరకు,*
దుర్ముహూర్తము : *మ12.23 – 1.12,*
మరల *మ2.50 – 3.39*
అమృతకాలం : *మ2.24 – 3.57,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.50,
సూర్యాస్తమయం: 6.07,

*_నేటి విశేషం_*

*నేటి నుండి మహాలయ పక్షం ప్రారంభం – మహాలయ పక్షం అనగా ఏమిటి??*
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది.
పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (సెప్టెంబర్ 21 న) నైనా చేసి తీరాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
పౌర్ణమి తరువాత మొదలయ్యే భాద్రపద కృష్ణపక్షం పితృదేవతారాధన సమయం.
పదిహేనురోజులపాటు లేదా ఒక్క రోజుననైనా పితృదేవతారాధన ఈ ‘మహాలయపక్షం’లో సంప్రదాయం. తండ్రి జీవించి ఉన్నవారు ఈ పితృకార్యాలను నిర్వహించరు. ఈ పదిహేను రోజులు నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదులద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.
ప్రతియేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం. 15 రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆ ఒక్కరోజు వారు అన్న శ్రాద్ధం పెట్టలేకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.
‘హేమాద్రి’అనే ధర్మ శాస్త్ర గ్రంథంలో దీని గురించి చెప్తూ ఏమీ చేయలేని నిష్ఠ దరిద్రుడు, ఒక పెద్ద అరణ్యంలోకి వెళ్ళి ముళ్ళకంచెను హత్తుకుని, పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తారు.
ఈ మహాలయంలో ఒక విశేషం వారి వారి జ్ఞాతి, బంధువులందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

*_🌿శుభమస్తు🌿_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏