తెలంగాణ రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరదసాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటల కొనుగోళ్లపై జిల్లాల అధికారులతో చర్చించిన సీఎం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి : ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని నియమించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్‌కు రిపోర్టు చేరాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్ఫష్టం చేశారు. వరదలకు దెబ్బతిన్నరోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుండాలని, చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.