ఉపాధి హామీ చట్టాన్ని తొలగించనున్న కేంద్రం.. కొత్తగా జీ రామ్‌ జీ పథకం..!

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ (MGNREGA) రద్దు చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. దీని స్థానంలో గ్రామీణుల ఉపాధి కోసం కొత్త చట్టాన్ని (VB G Ram G) తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతులను సోమవారం లోక్సభ సభ్యులకు అందించింది. అంతేకాదు లోక్‌సభ అనుబంధ కార్యకలాపాల జాబితాలో కూడా ఈ బిల్లును చేర్చింది.

ఇటీవలే ఈ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన’గా మార్చిన మోదీ సర్కార్, ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్నే లేపేసేందుకు సన్నద్ధమవుతుండడం గమనార్హం. వాస్తవానికి ఈ పథకాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా దాని పేరు మార్చారు. కాగా, ఇప్పుడు దీన్ని పూర్తిగా రద్దు చేసి, కొత్తగా ‘వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ బిల్లు, 2025ను మోదీ సర్కార్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, భారతదేశంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు బిల్లులో పేర్కొన్నారని సమాచారం.

కొత్త బిల్లులో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరంలో కనీసం 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధి కల్పించనున్నారు. దీని ద్వారా సుసంపన్న, సుస్థిర గ్రామీణాభివృద్ధిని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.