గ్రామపంచాయతీ పోరులో కోవర్టులతో అభ్యర్థులలో అలజడి..!

పంచాయతీ ఎన్నికల్లో ఇక తుదిపోరు మాత్రమే మిగిలింది. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికల్లో ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. ఆఖరి విడత ఎన్నికలకు ప్రచారానికి సైతం సోమవారం సాయంత్రంతో తెర పడింది. గడిచిన రెండు దశల ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ఆఖరి విడత బరిలో నిలిచిన అభ్యర్థులకు కోవర్టుల గుబులు పట్టుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహ, ప్రతివ్యూహాల విషయాల పట్ల ఎంత గోప్యంగా వ్యవహరించినా ప్రత్యర్థులకు సులువుగా తెలిసిపోతున్నాయి. దీంతో వారి బలాలు, బలహీనతలతో పాటు ఇతర వ్యూహాలు కూడా ప్రత్యర్థులకు చేరుతున్నాయనే సందేహంతో అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ఎవరిని నమ్మాలో తెలియక : పార్టీకి మద్దతు తెలుపుతూనే, ప్రత్యర్థులకు సమాచారమిస్తూ తమను బలహీన పరుస్తున్న కోవర్టులతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. సొంత పార్టీలోనే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇరు వర్గాల్లోని ముఖ్యమైన వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని తమవైపుకు మళ్లించికునే ప్రయత్నాలు జరుగుతున్నా, వాటిని అడ్డుకోవడం అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. ఎప్పటికప్పుడు కోవర్టులు సమాచారాన్ని చేరవేస్తుండటంతో పోటీదారులు నిరత్సాహం చెందుతున్నారు..

ఫిరాయింపులు జరిగిన చోటే : సమాచారాన్ని చేరవేసే కోవర్టులు ఎవరని తెలయనప్పటికీ కొందరిపై అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్లో పంచాయతీలో రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత, కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ఉత్తర్వులు వెల్లువడిన తర్వాత రెండు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లోనే పార్టీ ఫిరాయింపులు అధికంగా సాగాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీల్లో ఎక్కువగా జరిగాయి. ఇలాంటి చోట్ల ఆయా పార్టీల నుంచి సర్పంచి అభ్యర్థులుగా ఒకరికి మించి ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రెబల్స్ మధ్య గట్టిపోటీ ఉన్న పంచాయతీల్లో, అక్కడ పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు ఎవరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారు. ప్రత్యర్థులకు ఒక పార్టీ నుంచి మరో పార్టీ గూటికి చేరిన వారు సమాచారమిస్తున్నారా? తమ వర్గంలో ఉన్నవారే ఇస్తున్నారా? అనుకుంటూ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు..