ఫిబ్రవరి 7,8 తేదీల్లో పవన్ ప్రచారం..!

పవన్ కళ్యాణ్‌ను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమకు మద్దతు ప్రకటించారని, ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని ప్రకటించిన టీబీజేపీ…

ఫిబ్రవరి 11న తెలంగాణలో పురపోరు జరగనుంది. బీజేపీతో పోలిస్తే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని పవన్ ను ప్రచారంలో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రాత్రికి రాత్రి పవన్ వద్దకు వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao), కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణలో పొత్తుపై చర్చించి.. హడావిడిగా ఐక్యతను ప్రకటించారు. కాగా, పవన్ కళ్యాణ్ కు ఏపీతో పాటు తెలంగాణలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో పొత్తు కచ్చితంగా తమకు కలిసి వస్తుందని.. బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు…

ఫిబ్రవరి 7,8 తేదీల్లో పవన్ ప్రచారం..
పురపోరులో భాగంగా తెలంగాణలో పవన్ పర్యటనకు సంబంధించిన తేదీలను జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని స్పష్టం చేసింది. జనసేన – బీజేపీ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేస్తున్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల పోటీ ఉంటుందని జనసేన మంగళగిరి కార్యాలయం అధికారికంగా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే జనసేన కంటే గణనీయ సంఖ్యలో బీజేపీ నుంచే అభ్యర్థులు బరిలో నిలుస్తారన్న విషయం అర్ధమవుతోంది.