నెదర్లాండ్స్ పై అమెరికా విజయం…

ICC INTERNATIONAL CRICKET
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ముచ్చటగా మూడో మ్యాచ్‌లో గెలుపొందింది…గ్రూప్-ఏలో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అమెరికా 93 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.

తెలుగు తేజం సాయితేజ ముక్కమల్లా(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్మిత్ సింగ్(4/21) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు..ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాయితేజతో పాటు శుభమ్ రంజనే(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్) రాణించాడు. కెప్టెన్ మోనాంక్ పటేల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) పర్వాలేదనిపించాడు.

నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే(3/37) మూడు వికెట్లు తీయగా.. లోగన్ వాన్ బీక్, కైల్ క్లేన్, ఫ్రెడ్ క్లాసెన్ తలో వికెట్ తీసారు. అనంతరం నెదర్లాండ్స్ 15.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. బాస్ డీ లీడే(23), స్కాట్ ఎడ్వర్డ్స్(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అమెరికా బౌలర్లలో హర్మిత్ సింగ్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. వాన్‌ షాక్ విక్(3/21) మూడు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ మోహ్‌సిన్(2/19) రెండు వికెట్లు తీయగా.. నోష్‌తుష్‌కు ఒక వికెట్ దక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో నెదర్లాండ్స్‌పై అమెరికాకు ఇదే తొలి విజయం. గతంలో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా మూడు సార్లు నెదర్లాండ్స్‌నే విజయం వరించింది. కానీ తాజా మ్యాచ్‌లో అమెరికా పూర్తి ఆధిపత్యంతో చరిత్రను తిరగరాసింది…

సాయితేజ మన తెలుగబ్బాయి..

సాయితేజ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అతని తండ్రి పేరు ముక్కమల్లా కిరణ్. వారు అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. సాయితేజ కుడిచేతి వాటం బ్యాటర్. అమెరికా సీనియర్ జట్టులో కీలకమైన టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2023లో ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్స్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై సాయితేజ అద్భుతమైన సెంచరీ (120 పరుగులు) సాధించాడు. దీనివల్ల వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అమెరికన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అమెరికా జట్టులో 9 మంది ప్రవాస భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే..