ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 బడ్జెట్ గణాంకాల్లోని వాస్తవాలను మోసాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రజలను వంచిస్తూ ఈ బడ్జెట్ను రూపొందించారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాలు బడ్జెట్లో ఎక్కడా కనిపించకుండా గాలికి కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.చంద్రబాబు పాలనలో పర్ఫార్మెన్స్ వీక్ గా పబ్లిసిటీ పీక్ లో ఉందని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని అయితే వృద్ధి రేటు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరగకుండా గ్రోత్ రేటు పెరిగిందని చెప్పడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్షా 19 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తే కేవలం 94 వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గణాంకాలతో వివరించారు. కాగ్ విడుదల చేసిన 23 రాష్ట్రాల సొంత ఆదాయాల పురోగతి జాబితాలో ఏపీ 22వ స్థానంలో ఉందని చంద్రబాబు పాలనలో రాష్ట్రం అట్టడుగున ఉందని విమర్శించారు.
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ప్రజల సొమ్ము కాకుండా చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తోందని జగన్ ఆరోపించారు. ‘దోచుకో దాచుకో పంచుకో’ అన్న చందంగా కూటమి ప్రభుత్వం సాగుతోందని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి లోకేష్ పవన్ కల్యాణ్ విమానాలు హెలికాప్టర్లలో విహరిస్తూ గాల్లోనే తేలుతున్నారని దుయ్యబట్టారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం విజయవాడ నుండి ఢిల్లీకి అక్కడి నుండి కొలంబోకు వెళ్లడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ టీవీలో చూడాల్సిన మ్యాచ్ల కోసం విదేశాలకు వెళ్లడం దారుణమని పేర్కొన్నారు.
”రాష్ట్ర అప్పులపై బడ్జెట్ లో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.47 లక్షల కోట్ల అప్పు ఉంది. 2014-19 చంద్రబాబు హయాంలో 2.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. 2019-24 వైసీపీ హయాంలో 3.31 లక్షల కోట్లు అప్పులు చేశాం. మా హయాంలో 9 లక్షల కోట్లు అప్పులు చేశామని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు ఈ రెండేళ్లలోనే 3.17 లక్షల కోట్లు అప్పులు చేశారు. చేస్తున్న అధిక అప్పులు చాలవన్నట్టు పబ్లిక్ అకౌంట్స్ లోని డబ్బులు కూడా వాడేస్తున్నారు.
అప్పులు చెయ్యడంలో చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు. చేసిన అప్పులతో ఎక్కడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యడం లేదు. రెండేళ్లుగా అప్పులు చెయ్యడం జేబుల్లోకి వేసేసుకోవడం ఇదే జరుగుతోంది. మ్యానిఫెస్టో పదానికి నిజమైన అర్థం వైసీపీ హయాంలో చూపించాం. చంద్రబాబు దృష్టిలో మాత్రం మ్యానిఫెస్టో అనేది చిత్తు కాగితమే అని రుజువు చేశారు.
చంద్రబాబు, పవన్ లు బాండ్ లు ఇచ్చి హామీలు అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మరి రెండేళ్లవుతోంది హామీలు ఎక్కడ అమలు చేశారు..? ఇచ్చిన ప్రధాన హామీలకు బడ్జెట్ లో అతీగతి లేదు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి పథకం ప్రస్తావన లేదు. స్త్రీశక్తి అని అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేశారు. ఆడబిడ్డ నిధి ప్రస్తావన లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ ఊసే లేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సూపర్ ప్లాప్ సినిమా చూపిస్తున్నారు” అని విరుచుకుపడ్డారు జగన్.
బడ్జెట్లో రాష్ట్ర అప్పుల వివరాలను పూర్తిగా తొలగించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పుల వివరాలు తెలిస్తే ప్రభుత్వ అసలు రంగు బయటపడుతుందనే భయంతో చంద్రబాబు ఈ పని చేశారని విమర్శించారు. కాగ్ నివేదికలు ఆదాయం తగ్గింది అని చెబుతుంటే చంద్రబాబు మాత్రం టేప్ రికార్డర్ లాగా ఆదాయాలు పెరుగుతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేపదే అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని మోసానికి అబద్ధానికి నిలువుటద్దం చంద్రబాబేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
క్రికెట్ అభిమానం ఉంటే టీవీలో చూస్తే సరిపోదా..? లోకేశ్ పై జగన్ విమర్శలు
”కాగ్ లెక్కల ప్రకారం సొంత ఆదాయ వృద్ధి రేటులో ఏపీ 22వ స్థానంలో ఉంది. చంద్రబాబు అసమర్థత కారణంగా రాష్ట్రం ఈ స్థాయికి దిగజారిపోయింది. వాస్తవాలు ఇలా ఉంటే బడ్జెట్ లెక్కల్లో మాత్రం వృద్ధి రేటులో దూసుకుపోతున్నామని చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు, రాష్ట్ర ఖజానాకు వెళ్లడం లేదు. చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్రంలో వనరులను దోచేస్తున్నారు, అందుకే రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.
ఒక పక్క రాష్ట్రంలో ఆదాయం లేదు. మరోపక్క చంద్రబాబు పవన్ లోకేశ్ దుబారా ఖర్చులు చేస్తున్నారు. ముగ్గురికి మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు. నిత్యం గాల్లోనే తిరుగుతున్నారు. ఉదయం ఒక రాష్ట్రం, మధ్యాహ్నం ఒక రాష్ట్రం, సాయంత్రం వేరొక దేశంలో కనిపిస్తున్నారు. కొలంబోలో క్రికెట్ ఆడుతుంటే లోకేశ్ కి ఏం పని..? బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు జల్సాలకు దేశాలు పట్టి తిరగడమేంటి..? క్రికెట్ అభిమానం ఉంటే టీవీలో చూస్తే సరిపోదా..? నేను మొన్నటి మ్యాచ్ ను టీవీలోనే చూశా” అని జగన్ విమర్శించారు.