కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో అభయహస్తం కాదని, మోసాల పుట్ట… హరీష్ రావు..

యంగ్‌ ఇండియా స్కూల్స్‌ టెండర్లలో వెయ్యి కోట్ల స్కామ్‌ జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల వరకు 4.56 శాతం నుంచి 4.96 వరకు ఎక్సెస్‌కు ఖరారు కావడమే ఇందుకు నిదర్శనం’ అంటూ హరీశ్‌రావు ఆధారాలు చూపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో 105 స్కూల్స్‌ నిర్మిస్తున్నామని గొప్పగా చెప్పి 76 మాత్రమే మంజూరు చేశారని, అధికార, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను విస్మరించడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. స్కూల్స్‌ టెండర్లలో గోల్‌మాల్‌పై సిట్‌ లేదా ఏసీబీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు…
ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలతో కూడిన కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో అభయహస్తం కాదని, మోసాల పుట్ట అని హరీశ్‌ అభివర్ణించారు. ‘ఎస్సీల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యమిచ్చింది..2014-15లో రూ. 1,396 కోట్లు కేటాయించగా, 2023-24 వరకు రూ. 4,703 కోట్లకు పెంచినం..2021-22లో గరిష్ఠంగా రూ. 7,361 కోట్లు వెచ్చించినం..కానీ కాంగ్రెస్‌ సర్కార్‌ 2024-25 బడ్జెట్‌లో కేవలం రూ. 1,395 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇదీ బీఆర్‌ఎస్‌ మొదటి బడ్జెట్‌లో చేసినదాని కంటే తక్కువ’ అని వివరించారు. ‘ఎస్సీ సంక్షేమానికి 2024-25లో 33, 124 కోట్లు కేటాయించి, ఖర్చు కేవలం రూ.14,148 కోట్లు మాత్రమే (42 శాతం), 2025-26లో రూ.40,231 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ, 14,732 కోట్లు మాత్రమే..ఈ గణంకాలే కాంగ్రెస్‌ దళిత ద్రోహానికి మచ్చు తునక’ అని స్పష్టంచేశారు.

ఇక ఎస్సీ కార్పొరేషన్‌కు రూ, 3,267 కోట్లు కేటాయించి కేవలం రూ. 28 కోట్లే ఖర్చుచేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌పై కక్షతో దళితబంధుకు కాంగ్రెస్‌ దళితబంధుకు దోఖా చేసిందని ధ్వజమెత్తారు. అభయహస్తం పేరిట రూ. 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఓ వైపు బడ్జెట్‌లో కోతలు పెడుతూ దళితులను వంచిస్తున్న సర్కార్‌ మరోవైపు రెండేండ్లలో 50 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను లాక్కున్నదని, ఒక చేత్తో కోతలు పెడుతూ మరో చేత్తో భూ మేతకు పాల్పడుతున్నదని విమర్శించారు..