ట్రావిస్ హెడ్ భార్యపై సోషల్ మీడియాలో వేధింపులు.

ట్రావిస్ హెడ్ భార్యపై సోషల్ మీడియాలో వేధింపులు

ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన SRH vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య నెలకొన్నన వివాదం

ఈ నేపథ్యంలో తనపై దాడులు చేస్తామని బెదిరింపులతో పాటు, సన్నిహితులు, కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్..

క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే చిన్నపాటి వాగ్వాదాలు కొన్నిసార్లు హద్దులు దాటి వారి కుటుంబ సభ్యుల వరకూ చేరుతున్నాయి.
తాజాగా ట్రావిస్ హెడ్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మైదానంలో జరిగిన మాటల యుద్ధం తర్వాత తీవ్ర ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నాడు.
ముఖ్యంగా కొందరు భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రావిస్ హెడ్‌తో పాటు ఆయన భార్య జెస్సికాను కూడా లక్ష్యంగా చేసుకుని దూషణలు, ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు.
ఈ ఘటనపై జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియా సంస్థ ‘ది అడ్వర్టైజర్’తో మాట్లాడారు…

ఈ విషయాలపై జెస్సికా హెడ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో జరిగిన ఒక సాధారణ మ్యాచ్ వివాదాన్ని మనసులో పెట్టుకుని, సోషల్ మీడియా వేదికగా కొంతమంది సైబర్ వేధింపులకు దిగుతున్నారని ఆమె వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను, మిత్రులను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా.. ఏకంగా తమపై దాడులకు పాల్పడతామంటూ కొందరు నెటిజన్లు ఇన్‍బాక్స్‌లో మెసేజ్‌లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె పేర్కొన్నారు. మైదానంలో ఆటను ఆటలాగే చూడాలని, అంతేకాని ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబాలను ఇందులోకి లాగడం సరికాదని ఆమె హితవు పలికారు.

మాకూ కుటుంబాలు ఉంటాయి, గౌరవించండి: జెస్సికా హెడ్!
క్రీడాకారులకు కూడా సాధారణ వ్యక్తుల్లాగే కుటుంబాలు, పర్సనల్ లైఫ్ ఉంటాయని, వారిని కూడా గౌరవించడం నేర్చుకోవాలని జెస్సికా ఈ సందర్భంగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా పలువురు విదేశీ ఆటగాళ్ల భార్యలు ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొన్న ఉదంతాలు ఉండగా.. తాజా ఘటన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్యాన్ వార్స్ ఎంతటి వికృత రూపం దాల్చుతున్నాయో అద్దం పడుతోంది. క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమేనని, క్రీడా స్ఫూర్తిని మరిచి ప్రవర్తించే ఇలాంటి సైకో నెటిజన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు..