వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్

వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు…ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. .ఈ సందర్బంగా ఇటీవల హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, తీసుకున్న చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా జూన్ 1వ తేదీన సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేశానని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.