గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహంలో ఉంటున్న ఓ ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఆనంద్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఒక పీజీలో నివాసముంటున్న యువతి ఇంటీరియర్ డిజైనింగ్ అభ్యసిస్తోంది. ఆమె శనివారం రాత్రి 10 గంటల సమయంలో వాకింగ్ కోసం బిల్డింగ్ టెర్రస్‌కు వెళ్లగా, అదే సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు. ఆ యువతి టెర్రస్ నుండి కిందకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో.. సెక్యూరిటీ గార్డు ఆమె మెడకు వైరు చుట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆనంద్‌నగర్ పోలీసులు, లోకల్ క్రైమ్ బ్రాంచ్ (LCB), క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెంటనే అప్రమత్తమై దాదాపు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాత్రంతా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితుడైన సెక్యూరిటీ గార్డు ధర్మ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందిన ఈ నిందితుడు పీజీలో సెక్యూరిటీ గార్డుగా చేరి కేవలం కొన్ని రోజులే అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితుడు లిఫ్ట్ ద్వారా ఫ్లోర్లు, టెర్రస్ మధ్య తిరిగిన దృశ్యాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణాపాయం నుండి బయటపడిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.