నేను పార్టీ వదిలి వెళ్ళను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..మాజీ మంత్రి కొండా సురేఖ..

నేను పార్టీ వదిలి వెళ్ళను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..

_• అసెంబ్లీకి కూడా హాజరవుతాను._– మాజీ మంత్రి కొండా సురేఖ.

దేవాదాయ శాఖ మంత్రిగా తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ స్పందించారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తారని, తనకు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శిక్షించారని అన్నారు. తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఏంటని.. ఆమె అభిప్రాయంతో తనకేం సంబంధమని కాంగ్రెస్ పెద్దలను సురేఖ సూటిగా ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే చేసేదాన్నని, తన వివరణ అడిగి చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా పర్వాలేదని కొండా సురేఖ చెప్పుకొచ్చారు….మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘మంత్రి పదవి నాకు ఆభరణం మాత్రమే. కారణం చెప్పకుండా తొలగించడం బాధాకరం. గతంలో మంత్రి పదవికి స్వయంగా నేనే రాజీనామా చేశా. ప్రస్తుతం మంత్రులు సంతోషంగా లేరు. ఈ విషయం గుండెపై చేయి వేసుకొని వారు చెప్పాలి. మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడాలి. పనులు కావాలంటే ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కాదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతున్నాను. నేను పార్టీని, ప్రభుత్వాన్ని ఏం అనలేదు. మల్లు రవి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినవారే. ఇందిరాగాంధీని జైపాల్ రెడ్డి తిట్టారు. రోశయ్య సైతం ఇందిరాగాంధీని తిట్టారు. సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేసిన వారికీ పదవులు ఇచ్చి సన్మానం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంటాను…. అన్ని నియోజకవర్గాలు ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో నా నియోజకవర్గాన్ని కూడా అలాగే డెవలప్ చేయాల్సిందే.. మిగతా పార్టీ వాళ్లకి ఎలాగైతే నిధులు ఇస్తున్నారో నా నియోజకవర్గానికి కూడా అలాగే నిధులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు..