బొడ్రాయి బజార్ లో కన్నుల పండుగ గా బోనాల పండుగ

బొడ్రాయి బజార్ లో కన్నుల పండుగ గా బోనాల పండుగ

ఆనందోత్సవాల మధ్య బొడ్రాయి వద్ద బోనం సమర్పించిన మహిళలు

అంగరంగ వైభవంగా బోనాల పండుగను ఘనంగా చేపట్టిన బొడ్రాయి బజార్ వాసులు

దేవరకొండ…….
దేవరకొండ పట్టణంలోని బొడ్రాయి బజారులో బోనాల పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని బొడ్రాయి బజార్ వాసులు హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల వేడుకను అంగరంగ వైభవంగా చేపట్టారు. మహిళలు యువతులు పట్టు వస్త్రాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించుకొని మట్టి కుండ కు పసుపు బొట్టు పెట్టి పరమాన్నంతో బోనం తయారుచేసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి వేపాకులు పూలతో ఆకట్టుకునేలా అలంకరించిన బోనంను మహిళలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. యువకులు, కాలనీ పెద్దలు డీజే సౌండ్, బ్యాండు వాయిద్యాల మధ్య నృత్యాలు చేయగా, పోతురాజులు వేసిన విచిత్ర విన్యాసాల మధ్య, మహిళలు యువతులు కోలాటాలు వేసి ఒక ఆహ్లాద భరితమైన వాతావరణంలో బొడ్రాయి బజార్ వాసులంతా ఆనందోత్సవాల మధ్య బోనాల పండుగను ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. బోనం ను బొడ్రాయి వద్ద అప్పచెప్పి పోతురాజుల వద్ద మేకలను, కోళ్లను, మేకపోతులను బలి ఇచ్చి మహా నైవేద్యంగా సమర్పించారు. తరతరాలుగా సాంప్రదాయ బద్ధంగా వస్తున్న బోనాల పండుగ ద్వారా ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టింపబడుతుందని, రాత్రివేళ దీపాలు వెలిగించిన బోనం తో ముస్తాబైన మహిళలు ర్యాలీగా బోనాలు సమర్పించే తీరును చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనే అంత ఆనందం వేస్తుందని బొడ్రాయి బజార్ వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి బజారుకు చెందిన పెద్దలు యువతి యువకులు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.