రష్యా ఉక్రెయిన్‌ యుద్ధానికి చమురు కొనుగోళ్లు కారణం కాదు..భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌.

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధానికి చమురు కొనుగోళ్లు కారణం కాదని, వాటిని నిలిపివేయడం వల్ల కూడా యుద్ధం ముగియదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పష్టం చేశారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి పరిష్కారం యుద్ధభూమిలో లభించదని, చర్చలు, దౌత్యం, సంప్రదింపుల ద్వారానే సాధ్యమని తెలిపారు. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రియ్‌ సిబిహాతో కీవ్‌లో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చర్చలతోనే పరిష్కారం
రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న ప్రశ్నకు జైశంకర్‌ స్పందించారు. రష్యా నుంచి చమురు, అల్యూమినా, ఖనిజాలు, లోహాలు, ఎరువులు కొనుగోలు చేయడం లేదా చేయకపోవడం వల్ల యుద్ధం పరిష్కారం కాదన్నారు. ఈ సంక్షోభానికి చర్చలు, దౌత్యం, సంప్రదింపులే మార్గమని స్పష్టం చేశారు. భారత్‌ వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇంధన భద్రత ఎంతో కీలకమని జైశంకర్‌ అన్నారు. ప్రపంచ ఇంధన పరిస్థితులు ఇప్పటికే క్లిష్టంగా ఉన్న సమయంలో దేశ ప్రజలకు అవసరమైన ఇంధనాన్ని అందించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. ఈ అంశంలో ఉక్రెయిన్‌కు తన అభిప్రాయం ఉన్నట్లే భారత్‌కు కూడా తన వైఖరి ఉందని, ఇరు దేశాల అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు..

భారత్‌కు ఉన్న వైఖరిని కూడా ఇతర దేశాలు గౌరవిస్తాయని ఆశిస్తున్న: జైశంకర్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇంధన కొరత పరిస్థితులు నెలకొన్నాయని,ఈ నేపథ్యంలో 140 కోట్ల మంది భారతీయులకు అవసరమైన ఇంధనాన్ని అందించడంలో ఉన్న సవాళ్లను ఇతర దేశాలు అర్థం చేసుకోవాలని కోరారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో ఉక్రెయిన్‌కు ఒక స్పష్టమైన దృక్కోణం ఉంటుందని, దానిని భారత్ గౌరవిస్తుందని జైశంకర్ తెలిపారు.

అదే విధంగా ఈ అంశంపై భారత్‌కు ఉన్న వైఖరిని కూడా ఇతర దేశాలు గౌరవిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

“యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఎవరో చమురు,అల్యూమినియం, ఖనిజాలు, లోహాలు లేదా ఎరువులు కొనడం లేదా కొనకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. వివాదానికి ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్యం, సంప్రదింపుల ద్వారానే పరిష్కారం కనుగొనాలి” అని జైశంకర్ పేర్కొన్నారు.