ఉప్పాడలో డాల్ఫిన్
తీరంలో డాల్ఫిన్లు సందడి చేస్తున్నాయి. ఉప్పుటేరు సమీపంలో సముద్ర తీరంలో ఉదయం ఇవి కనిపించాయి. డాల్ఫిన్ల విన్యాసాలను బీచ్ రోడ్డును ప్రయాణించే వారు ఆసక్తిగా తిలకించారు. సెల్ఫోన్లో బంధించారు.
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరంలో సోమవారం డాల్ఫిన్స్ సందడి చేశాయి. సాధారణంగా సముద్రంలో లోతైన ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపించే డాల్ఫిన్స్ ఈసారి తీరానికి సమీపంలోకి రావడంతో స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా వీక్షించారు. అలల మధ్య నుంచి ఒక్కసారిగా పైకి ఎగసి, తిరిగి సముద్రంలోకి దూకుతూ డాల్ఫిన్స్ చేసిన విన్యాసాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి..
ఉప్పాడ తీరంలో డాల్ఫిన్స్ గుంపుగా కనిపించడంతో పలువురు తమ సెల్ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. సముద్రపు అలల మధ్య డాల్ఫిన్స్ అటూ ఇటూ తిరుగుతూ కనిపించడంతో ఈ దృశ్యాలను చూసేందుకు కొందరు తీరంలోనే వేచి చూశారు. డాల్ఫిన్స్ నీటి నుంచి పైకి ఎగిరే సమయంలో వాటి శరీరంపై పడిన సూర్యకాంతి, వెనుక భారీ అలల దృశ్యం వీడియోల్లో ప్రత్యేకంగా కనిపించింది.
సాధారణంగా డాల్ఫిన్స్ సముద్రంలో కొంత లోతైన ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. అయితే సోమవారం మాత్రం అవి తీరానికి చాలా దగ్గరగా కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సముద్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, అలల తీవ్రత, ఆహారం కోసం చేపల గుంపులను అనుసరించడం వంటి కారణాలతో డాల్ఫిన్స్ తీరానికి దగ్గరగా వచ్చి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు…మరోవైపు ఉప్పాడ తీరంలో డాల్ఫిన్స్ కనిపించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. “ఉప్పాడ సముద్రతీరంలో డాల్ఫిన్స్ గురూ!” అంటూ పలువురు ఈ వీడియోలను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఉప్పాడ సముద్రతీరంలో చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ్యంపై నెటిజన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు… మరికొందరు సోషల్ మీడియాలో డాల్ఫిన్ తీరం వెంబడి తిరగడానికి ముందస్తు ఏదో సంకేతాలు తెస్తుంది.. అంటూ కామెంట్స్ వైరల్ గా మారాయి..