రాష్ట్రంలో ప్రైవేటు ఆధార్ సెంటర్లు బంద్.. ఈ నెల నుంచే ప్రక్షాళన స్టార్ట్!..

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ (ఔట్‌సోర్సింగ్) ఆధార్ సెంటర్లు క్రమంగా మూతపడనున్నాయి. ప్రైవేటు భవనాల్లో నడిచే ఈ సెంటర్లన్నీ ఇకపైన విధిగా ప్రభుత్వ కార్యాలయాల్లో (భవనాలు)కి తరలాల్సి ఉంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఈ కేంద్రాలన్నీ పనిచేయనున్నాయి. ఈ నెల నుంచి ఒక్కటొక్కటిగా ప్రైవేటు ప్రాంగణాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి (ఇన్-హౌజ్ మోడల్) మారే ప్రక్రియ మొదలుకానున్నది. ఇందుకోసం టీఎస్‌టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్), ‘టీఎస్ ఆన్‌లైన్’ విభాగాలు చొరవ తీసుకోనున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తికావాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించింది. దేశవ్యాప్తంగా అమలయ్యే ఈ విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది.*

*?విలేజ్ లెవల్ ఎంట్రిప్రెన్యూర్స్ (వీఎల్ఈ) మోడల్‌లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను నిర్వహించుకోడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అవకాశం కల్పించింది. ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డుల్ని అందజేయడానికి వీలుగా తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలనే ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం, యూఐడీఏఐ (యూనిక్ ఐడీ అథారిటీ ఆఫ్ ఇండియా) భావించాయి. దేశంలో సెప్టెంబరు 2022 నాటికి సుమారు 134 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయిని, మొత్తం జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 93% మందికి మంజూరైనట్లేనని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఇటీవల పేర్కొన్నది.*

*?దుర్వినియోగం, ఫ్రాడ్‌లను అరికట్టే ప్లాన్*

*?లక్ష్యం దాదాపుగా నెరవేరినందున ఇకపైన ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ మిస్‌యూజ్ కాకుండా, అవకతవకలకు తావులేకుండా అన్ని కేంద్రాలూ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే విషయాన్ని 2017లోనే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మంత్రిత్వశాఖ ప్రాథమిక స్థాయిలో చర్చించింది. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న, తగిన భద్రత లేనిచోట్ల నడుస్తున్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను ఇకపైన తాలూకా, బ్లాక్, డివిజన్, మునిసిపల్, జిల్లా పరిషత్, కలెక్టర్ కార్యాలయాల్లోకి తరలించాలనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. కేవలం ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఆధార్ సెంటర్లు నడవాలన్న ఈ ప్రపోజల్‌పై ఏకాభిప్రాయమే వ్యక్తమైంది. బ్యాంకు ఖాతాలకు కేవైసీ (నో యువర్ కస్టమర్) విధానంలో ఆధార్ కార్డు నెంబర్‌ను అనుసంధానించడం తప్పనిసరికావడంతో చాలా నగరాల్లో బ్యాంకుల్లోనే ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనికి తోడు స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం వీఎల్ఈ మోడల్‌లో ప్రైవేటు వ్యక్తులకు కూడా కేంద్రాలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది.*

*?మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంలో పోలీసులు పట్టుకున్న ముగ్గురు నిందితుల్లో రామచంద్రభారతికి మూడు ఆధార్ కార్డులు ఉన్నాయని, పేర్లు, పుట్టినతేదీ వేర్వేరుగా ఉన్నాయంటూ ఆధారాలతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వివరాలను వెల్లడించారు. ఇలాంటి ఫ్రాడ్‌లు జరుగుతున్నట్లు యూఐడీఏఐ కూడా గుర్తించింది. ఇందులో భాగంగానే గత నెల నుంచి కేవలం 5-15 ఏళ్ళ మధ్య వయసువారికి మాత్రమే ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ జరుగుతున్నది. ఇప్పటికే ఆధార్ కార్డులు తీసుకున్నవారి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోడానికి ఆన్‌లైన్ విధానాన్ని ఎంచుకోవాల్సిందిగా సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ సర్క్యులర్ రూపంలో తెలియజేసింది.*

*?ఐదేళ్ళు కసరత్తు తర్వాత డెసిషన్*

*?ఆధార్ కార్డుల జారీలో జరుగుతున్న మోసాలను దృష్టిలో పెట్టుకున్న యూఐడీఏఐ గత నెల 14న కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాల్లోని రీజినల్ (ప్రాంతీయ) కార్యాలయాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మెమొరాండం జారీచేసింది. నవంబరు నుంచి ప్రతి నెలా 20% చొప్పున ప్రైవేటు ఆధార్ కేంద్రాలు ప్రభుత్వ ప్రాంగణాల్లోకి మారిపోవాలని, ఐదు నెలల్లో మొత్తం 100% పూర్తయ్యేలా టార్గెట్ ఖరారైంది. ఆ తర్వాత తెలంగాణ యూఐడీఏఐ రీజినల్ ఆఫీసర్ నుంచి అక్టోబరు 18న అందిన మెయిల్ సమాచారం, నవంబరు 1న జరిగిన మీటింగ్, తిరిగి నవంబరు 2న అందిన మెయిల్.. ఈ మొత్తం కరస్పాండెన్సులో మార్చి 31 నాటికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో పబ్లిక్ సర్వీసెస్ కార్యాలయాల పరిధిలోనే ఉండాలన్న నిర్ణయం జరిగింది.*

*?డెడ్‌లైన్ విధించిన యూఐడీఏఐ*

*♦️దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ సైతం వారం క్రితం టీఎస్‌టీఎస్ మేనేజింగ్ డైరెక్టర్‌కు, టీఎస్ ఆన్‌లైన్ నిర్వాహకులకు వారం క్రితం లేఖ రాశారు. అన్ని ప్రైవేటు/ఔట్‌సోర్సింగ్ సెంటర్లతో మాట్లాడి ఏ నెలలో ఎక్కడెక్కడి నుంచి సెంటర్లను తరలించాలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇకపైన ప్రైవేటులో కొత్త ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు అనుమతి ఇవ్వవద్దని జయేశ్ రంజన్ ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇన్-హౌజ్ మోడల్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నెలకొల్పేటట్లయితే మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రైవేటు సెంటర్లు ఉన్నాయో రిజిస్ట్రార్ ద్వారా గుర్తించి వాటిని తరలించే ప్రక్రియను ప్లాన్‌కు అనుగుణంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.*

*?ఆపరేటర్లకే నిర్ణయం తీసుకునే అవకాశం*

*?️ప్రభుత్వ ప్రాంగణంలోకి ఇన్-హౌజ్ మోడల్‌లో తరలించడానికి సిద్ధపడే ప్రైవేటు ఆపరేటర్ల (ఔట్‌సోర్సింగ్)కు ప్రస్తుతం ప్రభుత్వ ఆధార్ సెంటర్ ఆపరేటర్లకు చెల్లిస్తున్న తరహాలోనే రెమ్యూనరేషన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీఎల్ఈ/ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లు స్వంతంగా లాప్‌టాప్, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్, జీపీఎస్, వెబ్ కెమెరా లాంటి కిట్లను కొనుగోలు చేసినందున ఇప్పుడు ప్రభుత్వ ప్రాంగణంలోకి తరలించాలన్న నిబంధన మేరకు సుముఖంగా లేనట్లయితే వాటిని హాండ్ ఓవర్ చేస్తే ఇకపైన కొత్తగా నమోదయ్యే ప్రక్రియలో భాగంగా వచ్చే ఆదాయం నుంచి రీఇంబర్స్ చేసేలా అర్థం చేయించాలని టీఎస్‌టీఎస్, టీఆఎస్ ఆన్‌లైన్ నిర్వాహకులకు జయేశ్ రంజన్ ఫార్ములాను వివరించారు.*

*?పరిహారం చెల్లించేందుకు ఫార్ములా రెడీ*

*?ఒకవేళ ప్రభుత్వానికే విక్రయించాలనుకుంటే లాప్‌టాప్ ఏ సంవత్సరంలో తయారైందో అప్పటి రేటు ప్రకారం చెల్లించనున్నట్లు తెలిపారు. ఇతర ఎక్విప్‌మెంట్‌కు సైతం ఫిక్స్ డ్ రేట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఆపరేటర్ల నుంచి వారి సుముఖత వివరాలను ఈ నెల 15వ తేదీకల్లా అందేలా డెడ్‌లైన్ విధించారు. యూఐడీఏఐ నిర్దేశించిన మేరకు ఈ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్మినెంటుగా ఉన్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలతో పాటు పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లోనూ కొన్ని పనిచేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద సుమారు 400కుపైగా ఇవి ఉంటే ప్రైవేటు భవనాల్లో, ‘మీ సేవ’ కేంద్రాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉన్నట్లు అంచనా.*