ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ ప్రకటన అంతర్జాతీయ వేదికపై హల్చల్ చేసింది. అమెరికాలో ప్రముఖ స్పోర్టింగ్ ఈవెంట్ అయిన సూపర్ బౌల్లో ఈ యాడ్ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ సూపర్ ఈవెంట్‌ను చూడటానికి సుమారు 10 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. ఇందులో యాడ్ ఇవ్వాలంటే కనీసం రూ.36 కోట్ల నుంచి రూ.44 కోట్లు ఖర్చవుతుంది. అలాంటి ఈవెంట్లో రైతులకు సంబంధించిన యాడ్ కనిపించడం గమనార్హం. అయితే ఈ యాడ్ కేవలం కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రసారమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ట్విటర్లో హాట్ టాపిక్
ఏకంగా సూపర్ బౌల్‌లోనే రైతుల ఆందోళనలకు సంబంధించిన యాడ్ రావడంతో ఇది మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయంశమైంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలతో మొదలైన ఈ 30 సెకన్ల యాడ్ చరిత్రలో సుదీర్ఘమైన పోరాటంగా చెప్పుకున్నది. ఈ యాడ్ ఇవ్వడానికి వాలీ సిక్ కమ్యూనిటీ నిధులు సమకూర్చడం విశేషం. ఈ యాడ్ అమెరికాలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా ఎయిర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.