వందలాది మంది చూస్తుండగానే తాలిబన్ల ఘాతుకం…

అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు.. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఆఫ్ఘాన్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్‌ నాయకులు..
కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆఫ్ఘాన్‌ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. షరియా చట్టం ద్వారా ప్రజల్ని తీవ్రంగా హింసిస్తున్నారు.తాజాగా, దొంగతనం చేశారన్న ఆరోపణలతో నలుగురి చేతులను బహిరంగంగా నరికేశారు. కాందహార్‌లోని అహ్మద్‌షాహి స్టేడియంలో వందలాది మంది చూస్తుండగానే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడ్డారు. అదేవిధంగా, వివిధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మందిని బహిరంగంగా కొరడాతో కొట్టి శిక్షించారు. నిందితులను 35 నుంచి 39 సార్లు కొరడాలతో కొట్టి శిక్షించినట్లు అక్కడ అధికార ప్రతినిధి హజీ జైద్ తెలిపారు. కాగా, శిక్ష అమలు చేస్తున్న సమయంలో స్టేడియంలో నిందితుల ఫొటోలను ఆఫ్ఘనిస్థాన్ రీసెటిల్‌మెంట్, రిఫ్యూజీ మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు షబ్నమ్ నాసిమి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.