షర్ట్ విప్పితే గుట్టు వీడింది..ఖంగుతిన్న పోలీసులు.. !!!

గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు. కానీ కట్టలకు కట్టల నగదు దొరికింది. అవును.. చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకేరోజు పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే ఆంధ్రా నుంచే చెన్నైకు తరలుతోంది ఈ హవాలా మనీ, చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర భారీగా నగదు పట్టుబడింది. షర్ట్‌ లోపల సుమారు రూ.30లక్షలు, బ్యాగ్‌లో మరో రూ.30 లక్షలు గుర్తించారు రైల్వే పోలీసులు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతను రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్నాడని..కానీ విజయవాడ నుంచి చెన్నైకి టికెట్‌ తీసుకున్నట్టు గుర్తించారు. రైళ్లలో హవాలా మనీ, గంజాయి, మద్యం స్మగ్లర్లను పట్టుకునేందుకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా చేపట్టిన సోదాల్లోనే భారీగా నగదు పట్టుబడిందని, మనీని సీజ్‌ చేసి వారిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ మనీని ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో పడ్డారు…