.ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసన..కాంగ్రెస్‌ను ఛీకొడుతున్న విపక్షాలు…

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన AI ఇండియా సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కా లేకుండా ప్రదర్శన ఇచ్చిన తీరుపై సాధారణ ప్రజలతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి ప్రపంచ వేదికలపై రాజకీయాలు చేయడాన్ని విమర్శిస్తున్నారు. శుక్రవారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడంటూ, మోడీ కాంప్రమైజ్ అయ్యాడంటూ నినాదాలు చేశారు.

ఈ వ్యవహారంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ‘‘ ఈ ప్రదర్శన సరైనది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి ప్రవర్తన దేశ గౌరవాన్ని దిగజార్చుతుంది’’ అని మండిపడ్డారు. ఏఐ రంగంలో భారత నాయకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఇలాంటి వేదికల్ని రాజకీయ నాటకాల కోసం వాడుకోవడం విచారకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘ రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో సహా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు భారత్ వస్తున్నప్పుడు నకిలీ చైనా రోబోను తీసుకురావడం ప్రభుత్వం తప్పు. ఇదే విధంగా విదేశీ ప్రతినిధుల ముందు దేశం పరువు తీసేలా హంగామా చేయడం కూడా సరికాదు’’ అని వ్యాఖ్యానిచారు.

వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ చర్య అందర్ని తలదించుకునేలా చేసిందని, రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ దేశం విషయంలో అంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, ఎక్కడ ఎప్పుడు తెలపాలనేది తెలిసి ఉండాలని, అంతర్జాతీయ వేదికల్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం సరైంది కాదని అన్నారు..

ఏఐ సమిట్‌లో రచ్చ క్షమించరాని నేరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ రాహుల్… భారత్ లో ప్రజాస్వామ్యం లేదని, పౌర హక్కులను కాలరాస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. ఏఐ సదస్సు వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేయడం దేశ ఇమేజ్‌కు తీవ్ర భంగం కలిగించిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడానికి ఎన్నో మార్గాలున్నాయని, కానీ దేశాభివృద్ధిని ప్రతిబింబించే వేదికపై ఇలాంటి రచ్చ చేయడం సిగ్గులేని చర్య అని ఖండించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఇంపాక్ట్‌ సమిట్‌ను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ శ్రేణులు చేసిన ప్రయత్నాలు వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీసేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు…

అందరూ సిగ్గుపడేలా యూత్ కాంగ్రెస్ వ్యవహరించిందన్న జగన్

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎగ్జిబిషన్ హాల్ నంబర్-5 వద్ద నిరసనకు దిగారు. పదుల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు హఠాత్తుగా టీ-షర్టులు విప్పేసి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి టీ-షర్టులపై ‘ఎప్‌స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’ వంటి వాక్యాలు, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు ముద్రించి ఉన్నాయి.

సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు నిరసనకారులను ప్రశ్నించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన సదస్సు ప్రాంగణంలో కలకలం రేపింది.

ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… ఏఐ సమ్మిట్ లో మనమంతా సిగ్గుపడేలా యూత్ కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. మన రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయని ప్రశ్నించారు. మన దేశాన్ని ఎవరూ, ఎప్పుడూ కించపరచకూడదని చెప్పారు. మన మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ… ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలని అన్నారు.

కేటీఆర్ విమర్శల సారాంశం:

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ (AI Impact Summit) వేదికగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చేపట్టిన నిరసనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచే ఇలాంటి వేదికలను రాజకీయ నాటకాల కోసం వాడుకోవడం అత్యంత విచారకరమని ఆయన మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే..

ఢిల్లీలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే, యూత్ కాంగ్రెస్ సభ్యులు నిరసనలకు దిగారు. ఈ పరిణామంపై కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు.

అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యే సదస్సులలో రాజకీయ అసమ్మతిని ప్రదర్శించడం వల్ల ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ.. ఎక్కడ, ఎలా స్పందించాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ వేదికలు రాజకీయ పోరాటాలకు తావు కావని స్పష్టం చేశారు.

సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అనుబంధ విభాగమైన యూత్ కాంగ్రెస్ నిరసనలు చేపట్టడం హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “రాజకీయ నాటకాల కోసం ఇలాంటి వేదికలను ఎంచుకోవడం అత్యంత విచారకరం” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో నిరసనలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.