ఢిల్లీ విమానాశ్రయం లో ప్రయాణికుల రద్దీ నివారణ ..

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదేశం

R9TELUGUNEWS.COM : 
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షాకేంద్రాల వద్ద ప్రయాణికుల రద్దీపై చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య స్పందించారు. విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు జరిపేందుకు వీలుగా 120 రాపిడ్ పీసీఆర్ పరీక్షా యంత్రాలను ఏర్పాటు చేయించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జ్యోతిరాదిత్య విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. కొవిడ్ టెస్టింగ్ కోసం టైమ్ స్లాట్ లను సూచించేలా టోకెన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని మంత్రి విమానాశ్రయ అధికారులకు సూచించారు.
ప్రయాణికులు సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని మంత్రి కోరారు. ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి అదనంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల కౌంటర్ల సంఖ్యను పెంచామని విమానాశ్రయం సీఈఓ విదేహ్ కుమార్ జైపురియార్ చెప్పారు. తాము ప్రయాణీకులకు మరింత సౌకర్యం కల్పించడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని, విమానాశ్రయంలోని వెయిటింగ్ ఏరియాలో ఫుడ్ కౌంటర్లు అందుబాటులో ఉంచామని జైపురియార్ చెప్పారు.