స్పైస్ జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!!

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో పొగలు వచ్చాయి.
దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా లాండింగ్‌ చేశాడు. విమానంలో పొగతో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎయిర్‌పోర్ట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

విమానంలో మొత్తం 86 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. కాగా, విమానం అత్యవసర ల్యాడింగ్‌ దృష్ట్యా తొమ్మిది ఫ్లైట్లను దారిమల్లించామని తెలిపారు. వాటిలో ఆరు డొమెస్టిక్‌, రెండు అంతర్జాతీయ, ఒక కార్గో విమానం ఉన్నట్లు పేర్కొన్నారు. గతకొంతకాలంగా స్పైస్‌జెట్‌ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.