ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం…

*ఆళ్లగడ్డ.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిలప్రియను పోలీసులు గృహ నిర్బంధం చేశారు..

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అఖిలప్రియ వెల్లడించిన విషయం తెలిసిందే. నంద్యాల గాంధీ చౌక్‌ వద్దకు వస్తే ఆధారాలు బహిర్గతం చేస్తానని.. అక్కడికి రావాలంటూ రవిచంద్రకిశోర్‌రెడ్డికి ఆమె సవాల్‌ విసిరారు.

ఈ మేరకు శనివారం ఉదయం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల గాంధీచౌక్‌ వెళ్లేందుకు అఖిలప్రియ సిద్ధమయ్యారు. ఆమె వెళ్లడం ద్వారా నంద్యాలలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడతాయన్న అనుమానంతో ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో ఆళ్లగడ్డలోని అఖిలప్రియ నివాసానికి వెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా నంద్యాలకు వెళ్లకుండా అడ్డకుంటున్నామని చెబుతూ గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చారు. అఖిలప్రియ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అఖిలప్రియను గృహ నిర్బంధం చేయడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి..