హాస్యానికి నిలువెత్తు రూపం,హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య…

?హాస్యానికి నిలువెత్తు రూపం,హాస్యనట చక్రవర్తి
అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా?

*సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్న తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నవారు కొంతమందే ఉంటారు వారిలో అల్లు రామలింగయ్య ఒకరు. హాస్యం అనే పదం వినగానే అల్లు రామలింగయ్య గారు టక్కున గుర్తొస్తారు.*

1953లో ‘‘పుట్టిల్లు’’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా ద్వారా ప్రఖ్యాత నటీమణి జమునతోబాటు మరొక నటుడు కూడా కొత్తగా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. ఆయనే హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య

#నటించే అవకాశం రావడంతో భార్యా పిల్లలతో మద్రాసు పయనమయ్యారు. ఆ చిత్రం నిర్మాణ దశలో రామలింగయ్య ఉదరపోషణ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే హోమియో వైద్యం మీద దృషి పెట్టి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆ వైద్యంతో సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘పుట్టిల్లు’ సినిమా పూర్తి విడుదలైంది. కానీ ఆ సినిమా అపజయాన్ని చవిచూడడంతో రామలింగయ్యకు పెద్దగా అవకాశాలు రాలేదు. ‘పుట్టిల్లు’ చిత్రంలో నటించాక నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ‘మాస్టర్‌ బద్దంకి’ అనే పాత్రలో నటించే అవకాశం దొరికింది. వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో ఎన్‌.టి. రామారావు, జానకి నటించిన ఈ చిత్రం 1954లో విడుదలై విజయవంతం కావడంతో రామలింగయ్యకు నటుడిగా గుర్తింపు వచ్చింది. ధైర్యం కోల్పోకుండా చిత్రసీమనే నమ్ముకొని ఎలాంటి పాత్ర వచ్చినా అందులో రాణిస్తూ తనదైన ముద్ర వేసేందుకు రామలింగయ్య బాగా కష్టపడ్డారు. బోళ్ళ సుబ్బారావు నిర్మించిన ‘పల్లెపడుచు’ (1954) చిత్రంలో నటించాక రామలింగయ్యకు విజయావారి ‘మిస్సమ్మ’, అన్నపూర్ణావారి ప్రధమ చిత్రం ‘దొంగరాముడు’ సినిమాలలో అవకాశం చిక్కింది. నిష్ణాతులైన ఎల్‌.వి.ప్రసాద్, కె.వి. రెడ్డి వంటి దర్శకుల వద్ద పనిచేయడం రామలింగయ్యకు లాభించిన అంశం. ఆ తర్వాత భరణీ వారి ‘వరుడు కావాలి’, బి. ఎన్‌. రెడ్డి ‘భాగ్యరేఖ’ సినిమాలు రామలింగయ్యకు జీవం పోశాయి. 1960లో అల్లు రామలింగయ్య చిత్రసీమలో నిలదొక్కుకొని హాస్యపాత్రలు, హాస్యంతో కూడిన విలన్‌ పాత్రలు పోషిస్తూ మంచి మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ పేరు గడించారు. మాయాబజార్, మూగమనసులు, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, శంకరాభరణం, అందాలరాముడు, బుద్ధిమంతుడు, ప్రేమించి చూడు వంటి సినిమాలలో రామలింగయ్యకు అద్భుతమైన పాత్రలు దొరకడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లేని సినిమాలు బహు అరుదుగా ఉండేవి.
అంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు ఆయన.

#ద‌శాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న హాస్యంతో న‌వ్వులు పువ్వులు పూయించారు. ఆయ‌న ఎలాంటి పాత్ర పోషించిన అంత‌ర్లీనంగా హాస్యం దాగి ఉంటుంది. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్ర‌ల‌తో, ఆ తరువాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించారు. కేవలం హాస్యం మాత్రమే కాదు సెంటిమెంట్ స‌న్నివేశాల్లో…..విల‌న్ పాత్ర‌ల్లో త‌న‌దైన శైలిలో ద‌శాభ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.అల్లు రామలింగయ్య ఏం చేసినా? అది నవ్వులు పూయించడం రివాజయింది.

1929 అక్టోబర్‌ 1వ తేదీన పాలకొల్లుకు చెందిన అల్లు వెంక య్య, వీరమ్మలకు రామలింగయ్య ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. రామలింగయ్య చదువుల్లో పెద్దగా రాణించకపోవడంతో చిన్నతనంలోనే కొబ్బరి కాయల నాడెం చేయడంతో జీవితాన్ని ప్రారంభించారు. గాంధీజీ సిద్దాంతాల పట్ల ఆకర్షితుడై స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పాలకొల్లులో రైలుపట్టాలు తొలగించిన కేసులో జైలు జీవితం అనుభవించారు. అనంతరం కమ్యూనిస్టు భావజాలంతో ఆ పార్టీలో చేరారు.16వ ఏట భక్త ప్రహ్లాద వీధి నాటకంలో బృహస్పతి పాత్రతో రంగస్ధల ప్రవేశం చేశారు. పరకాల శేషావతారం రాసిన కూడూ-గుడ్డ నాటకంలో ఆచారి పాత్రను, ప్రజానాట్య మండలి డాక్టరు రాజారావు దర్శకత్వంలో ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ నాటకం నటుడిగా రామలింగయ్యకు మంచి గుర్తింపు తెచ్చింది .1952లో ప్రముఖ సినీ దర్శకుడు రాజారావు నిర్మించిన పుట్టిల్లు సినిమాలో రామలింగయ్య తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో పురోహితుడు పాత్రతో ఆయన మెప్పించారు.

*#ప్రత్యేకతలు, విశిష్టతలు…*

రామలింగయ్యకు సినిమాల్లో కొన్ని విచిత్ర సంభాషణలున్నాయి.

దేవుడు చేసిన మనుషులు (1973)లో తేయాకు ఎస్టేటులో పనిచేసే మమతతో ‘‘నిన్ను చూస్తుంటే నాకోరకమైన ‘అప్పుం’ కలుగుతావుంది’’ అంటారు. అలాగే ‘అందాలరాముడు’ సినిమాలో తీసేసిన తాసీల్దారు (తీతా) పాత్రలో లంచానికి ‘‘ఆమ్యామ్యా’’ అని పేరుపెట్టి వసూలు చేస్తుంటారు

#రామలింగయ్య వెయ్యికి పైగా చిత్రాలను పూర్తి చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. సుమారు 1200 సినిమాల్లో నటించిన రామ లింగయ్యకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. స్వయంగా సరస్వతి నాట్యమండలిని స్థాపించి పలు నాటక ప్రదర్శనలు ఇచ్చారు.

*#అల్లు రామలింగయ్య గారి క్రేజీ కోరిక ఏంటో మీకు తెలుసా…?*

రామలింగయ్య గారికో సరదా ఉంది. జనంలో తిరగాలని..వాళ్లు తమని గుర్తు పట్టి వెంటబడితే ఆనందంగా పారిపోవాలని. అందుకోసం ఆయన చిన్న చిన్న సాహసాలు చేస్తూండేవారు. ఓ సారి షూటింగ్ అయిపోగానే ఆయన తన కారులో లాడ్జికి బయిలుదేరారు. మధ్యలో కారు ఆపమన్నారు. ఎందుకు అన్నాడు అదే కారులో ప్రయాణిస్తున్న ఓ విలేకరి.ఎందుకేమిటి సబ్బు కొనుక్కోవాలి అన్నారు అల్లు రామలింగయ్య. లాడ్జికెళ్తే బాయ్ తెస్తాడుగా… అని విలేకరి అన్నాడు. దానికి ఆయన మీకేం బాబూ…స్నానం చేసి పౌడరు రాసుకొచ్చారు. నా మొహం చూడండి మోకప్ తీసేసి, ఆయిల్ పూసుకునేసరికి, ఎంత జిడ్డుగా తయారైందో. వెళ్లి వెళ్లంగానే స్నానం చెయ్యాలి. బాయ్ కోసం ఎదురుచూస్తూ కూచోడం నా వల్ల కాదు అంటూ కారు దిగి ఎదురుగా ఉన్న షాపు లోకెళ్లాడు.అక్కడ జనం ఉన్నారు కాని మేకప్ తీసేసి, సాధారణ దుస్తుల్లో ఉన్న రామలింగయ్యని ఎవరూ గుర్తు పట్టలేదు. దాంతో రామలింగయ్య …ఫలానా సబ్బెంత అనడిగాడు. నాలుగు రూపాయల చిల్లర అన్నాడు షాపువాడు.
నిజానికి ఆ సబ్బు ఖరీదంతే. అయితే అల్లు …అదేంటయ్యా సబ్బు నాలుగు రూపాయల చిల్లరంటావ్..సినిమావాళ్లని చూస్తే రెండు రూపాయల సబ్బుని నాలుగు రూపాయలంటావ్… అదీ అల్లు రామలింగయ్య ని చూస్తే పదన్నా అంటావ్ అన్నారు.ఆ మాటలకు షాపు వాడితో సహా అందరూ రామలింగయ్య ని చూసి గుర్తు పట్టడమేంటి…చుట్టు ముట్టేసారు. దాంతో రామలింగయ్య అబ్బబ్బ ఈ జనం సబ్బు కూడా కొనుక్కోనివ్వరు కదా అని పరుగెత్తుకొచ్చి కారెక్కేసారు. ఈ సంఘటన ఆ విలేఖరి తర్వాత ఓ పేపరు కు రాసారు.

*#ప్రభుత్వ సత్కారాలు.. అల్లు సంస్థలు…*

రామలింగయ్య సుదీర్ఘకాలం ప్రేక్షకులను నవ్విస్తూ, హాస్యంతో కూడిన విలనీలో రాణిస్తూ, క్యారక్టర్ర్‌ పాత్రలు పోషిస్తూ చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1990లో ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేసింది. 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’అవార్డుతో రామలింగయ్యను సత్కరించింది. ఆయన కాంస్య విగ్రహాన్ని సొంతవూరు పాలకొల్లులోను, విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ రోడ్డులోను ప్రతిష్టించారు.
రామలింగయ్య విగ్రహాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించారు

*భారతీయ చలనచిత్ర పరిశ్రమ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారత తపాలా శాఖ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. నృత్య కళామండలి వారు రామలింగయ్యకు ‘‘హాస్య కళా ప్రపూర్ణ’’ అనే బిరుదు ప్రసాదించారు. రాజమహేంద్రవరంలో అల్లు రామలింగయ్య పేరుతో ఒక హోమియో కళాశాల నెలకొల్పారు.*
73 ఏళ్ళ వయసులో 2004 జూలై 31వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు…