ప్రవాసులంతా బైడెన్‌ వైపు మళ్లడం వెనుక కమల అయస్కాంతత్వం ఉంది..!

కమలా హ్యారిస్‌కు విజయాలు కొత్త కాదు.

పదవులు తెలియనివి కాదు. నిజానికి, ఆమె జీవితంలో ఏ విజయమూ యాదృచ్ఛికం కాదు.
ఏ పదవీ పైరవీలతో రాలేదు. రమ్మన్నారా కమలమ్ములున్న కొలనుకు భ్రమరమ్ములనచ్యుతేంద్ర రఘునాథ నృపా! అన్నట్టు, కమలాలు ఉన్న చోటికి భ్రమరాలు వాటంతట అవే వస్తాయి. ఎవరూ బొట్టుపెట్టి పిలవరు! పదవులనే భ్రమరాలు కూడా కమలా హ్యారిస్‌ను వెతుక్కుంటూనే వచ్చాయి, అమెరికా ఉపాధ్యక్ష పీఠం సహా! …
జో బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వార్త అంత ప్రాధాన్యం సంతరించుకోలేదు. ట్రంప్‌ దూకుడు ముందు కురువృద్ధుడైన బైడెన్‌ మెతకదనం వెలవెలబోతుందనే భావించారంతా. కానీ, కాలం గడిచేకొద్దీ పోరు రసవత్తరంగా మారింది. బైడెన్‌ పరిణతితోపాటు కమలా హ్యారిస్‌ చురుకుదనం ఎన్నికలకు కొత్త జోష్‌ తీసుకొచ్చింది. ‘ట్రంప్‌కు ఓటేద్దామా, వద్దా’ అన్న అనిశ్చితిలో ఉన్న ప్రవాసులంతా బైడెన్‌ వైపు మళ్లడం వెనుక కమల అయస్కాంతత్వం ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల ఘట్టం ముగిసింది. దేశాన్ని పట్టాలమీదకు ఎక్కించి, పాత వైభవాన్ని తీసుకురావడం అన్నది బైడెన్‌, కమల ద్వయానికి అతిపెద్ద సవాలు..

ఆకటుకునే అంశాలు…

ఎలాంటి పనినైనా కృతనిశ్చయంతో చేయాలి’ అన్న తల్లి మాటే కమలకు వేదం. ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి బైడెన్‌ చెప్పిన తొలి కారణం కూడా అలాంటిదే. ‘దేన్నయినా ఎదుర్కోగల నిర్భీతి ఆమెలో ఉంది!’ అంటారాయన. సాక్షాత్తు దేశాధ్యక్షుడినే ఢీకొన్న చరిత్రా ఉంది తనకు. 2011లో కమల క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ఆ పదవిని ఓ భారతీయురాలు అందుకోవడమే గొప్ప అని అందరూ సంతృప్తి పడుతున్న సమయంలో, ఆమె ఓ అనూహ్యమైన పోరు చేయాల్సి వచ్చింది. అప్పట్లో క్యాలిఫోర్నియాలో ‘సబ్‌ప్రైమ్‌ మార్ట్‌గేజ్‌’ సమస్య వచ్చిపడింది. రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అప్పులు చేసి ఇండ్లను కొనుక్కున్న మధ్యతరగతివారు విలవిల్లాడుతున్న పరిస్థితి. వాళ్లపట్ల బ్యాంకులు ఎలాంటి కరుణా చూపలేదు. ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చొరవ ప్రదర్శించలేదు. కమల మాత్రం బాధితుల పక్షాన నిలబడ్డారు. బ్యాంకుల మెడలు వంచి, రుణభారాన్ని గణనీయంగా తగ్గించేలా కృషిచేశారు. ఓ దశలో, ‘ఆమెను ఓడించడం కష్టమే!’ అని ఒబామా సైతం అంగీకరించాల్సిన పరిస్థితిని సృష్టించారు. నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో… కమల దూకుడు, పట్టుదల వివాదాస్పదం అయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, అనుభవం పెరిగే కొద్దీ ఆమెలో పరిణతి కూడా బలపడింది. సందర్భాన్నిబట్టి ఓ అడుగు వెనక్కి వేయడమూ నేర్చుకున్నారు. మరణ శిక్ష, నిర్బంధ విద్య లాంటి అంశాలమీద తన విధానాలను మార్చుకోవడమే ఇందుకు ఉదాహరణ.