కశ్మీర్‌లో ప్రారంభమైన అభివృద్ధి శకాన్ని ఎవరూ ఆపలేరు. .కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా….

‘కశ్మీర్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు.. రెండేళ్లలోపు శ్రీనగర్‌కు మెట్రో’..

రానున్న రెండేళ్లలో శ్రీనగర్‌లో మెట్రో సేవలు ప్రారంభిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, ఇక్కడి ప్రతి జిల్లాలో హెలికాప్టర్ సేవలూ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
జమ్మూ-కశ్మీర్‌ పర్యటనలో ఉన్న షా.. రెండో రోజు ఆదివారం భగవతినగర్‌లో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ‘కశ్మీర్‌లో ప్రారంభమైన అభివృద్ధి శకాన్ని ఎవరూ ఆపలేరు. ఇది దేవాలయాల భూమి. శ్యామాప్రసాద్ ముఖర్జీ త్యాగాల భూమి. స్థానికంగా శాంతి, సామరస్యాలను దెబ్బతీసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం’ అని మాట్లాడారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత వాల్మీకి సమాజ్, పాకిస్థాన్ శరణార్థుల పట్ల వివక్ష ముగిసింది.. కశ్మీర్‌లో కనీస వేతనాల చట్టం అమలవుతోందని వివరించారు.
రూ.51 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
జమ్మూ ప్రజలు అన్యాయాలకు గురయ్యే రోజులు ముగిశాయని చెప్పేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చాను. కొందరు ఇక్కడ అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నారు. కానీ ఎవరికి ఇలా చేసేందుకు అవకాశం ఇవ్వబోమని భరోసా ఇస్తున్నా. భద్రత విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2004- 2014 మధ్య 2,081 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా 208 మంది మరణించారు. కానీ.. 2014- సెప్టెంబర్ 2021 వరకు 239 మంది మాత్రమే మృతి చెందారు. భవిష్యత్తులో దీన్ని పూర్తిగా తగ్గిస్తాం’ అని తెలిపారు. ‘కశ్మీర్‌ లోయకు ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022 చివరి నాటికి మొత్తం రూ.51 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక యువత సైతం జమ్మూ-కశ్మీర్‌ అభివృద్ధికి పాటుపడితే.. ఉగ్రవాదం కట్టడి అవుతుంద’ని షా పునరుద్ఘాటించారు.